iDreamPost
android-app
ios-app

Praja Palana: గ్యాస్ సిలిండర్, ఇల్లు వచ్చింది.. OTP చెప్పండంటూ ఫోన్.. చెప్పారా మీ ఖాతా ఖాళీ

  • Published Jan 08, 2024 | 8:13 AMUpdated Jan 08, 2024 | 8:22 AM

ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ పోలీసులు కీలక ప్రకటన జారీ చేశారు. కేటుగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆ వివరాలు..

ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ పోలీసులు కీలక ప్రకటన జారీ చేశారు. కేటుగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆ వివరాలు..

  • Published Jan 08, 2024 | 8:13 AMUpdated Jan 08, 2024 | 8:22 AM
Praja Palana: గ్యాస్ సిలిండర్, ఇల్లు వచ్చింది.. OTP చెప్పండంటూ ఫోన్.. చెప్పారా మీ ఖాతా ఖాళీ

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే సంక్షేమ పథకాల కోసం అర్హులను సెలక్ట్ చేసేందుకు ప్రజాపాలన అభయహస్తం కింద అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఈ కార్యక్రమం సాగింది. త్వరలోనే లబ్ధిదారులను సెలక్ట్ చేసి.. వారికి ఐదు గ్యారెంటీలను అమలు చేయనుంది.

పది రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా.. పది రోజుల్లో మొత్తం కోటీ 25 లక్షలకు పైచిలుకే దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి పోలీసులు అలెర్ట్ జారీ చేశారు. కేటుగాళ్లు కాచుకుని ఉన్నారు.. తస్మాత్ జాగ్రత్త అన్నారు. ఇంతకు పోలీసులు దేని గురించి అలర్ట్ చేశారంటే..

నేటి కాలంలో సైబర్ మోసగాళ్లు ఎంతలా రెచ్చిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు గిఫ్ట్ వచ్చింది, లాటరీ గెలిచారు, బంగారం గెలుచుకున్నారు, ఆర్డర్ డెలివరీ వచ్చింది.. ఓటీపీ చెప్పండి అంటూ ఫోన్ చేసి.. బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న నేరాల గురించి వింటున్నాం. ఈ క్రమంలోనే ప్రస్తుతం సైబర్ కేటుగాళ్లు.. తమ పంథా మార్చి.. ప్రజాపాలన లబ్ధిదారులకు కాల్ చేసి మోసం చేయడానికి రెడీగా ఉన్నారంటూ తెలంగాణ పోలీసులు ప్రజలను అలెర్ట్ చేశారు.

ఆరు గ్యారెంటీల కోసం తెలంగాణ ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వం అర్హులను సెలక్ట్ చేసి.. సంక్షేమ పథకాలను అమలు చేయనున్నారు. ఇక ఇదే అదునుగా చేసుకున్న కొందరు సైబర్ కేటుగాళ్లు.. లబ్ధిదారులకు ఫోన్ చేసి మీకు రేషన్ కార్డు, ఇల్లు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు మంజూరు అయ్యాయని.. మీ ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుందని.. దాన్ని చెప్పాలంటూ అడుగుతున్నారు. ఒకవేళ మీరు గనక ఓటీపీ చెప్తే.. ఇక అంతే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది. ఇప్పటికే కొందరు ఇలా డబ్బులు పొగొట్టుకున్నారు అంటున్నారు పోలీసులు.

ఇలాంటి ఫేక్ కాల్స్‌పై ప్రజలు, లబ్దిదారులు అలర్ట్‌గా ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అలాంటి కాల్స్ ఎవరూ చేయరని.. ఎవరైనా అలా ఫోన్ చేసి ఓటీపీలు అడిగితే చెప్పకూడదని సూచిస్తున్నారు. ఇలాంటి కాల్స్ ఎవరికైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని హెచ్చరించారు. ఇక ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులకు సంబంధించి అధికారులు.. ఆన్‌లైన్‌లో ప్రత్యేక సాఫ్ట్ వేర్‌లో ఎంటర్ చేసే ప్రక్రియ మొదలు పెట్టారు.

ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత.. అందులోని అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. ఒక్కసారి అర్హుల జాబితా సిద్ధమయ్యాక ప్రభుత్వమే అధికారికంగా ప్రకటిస్తుంది. కాబట్టి అప్పటివరకు ఇలాంటి ఫేక్ కాల్స్‌తో కాస్త జాగ్రత్త ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి