iDreamPost
android-app
ios-app

మంత్రి కీలక వ్యాఖ్యలు.. త్వరలోనే ధరణి స్థానంలో కొత్త వెబ్‌పోర్టల్‌

  • Published Feb 21, 2024 | 2:51 PM Updated Updated Feb 21, 2024 | 2:51 PM

Dharani Web Portal: ధరణి వెబ్‌పోర్టల్‌కు సంబంధించి మంత్రి శ్రీధర్‌ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

Dharani Web Portal: ధరణి వెబ్‌పోర్టల్‌కు సంబంధించి మంత్రి శ్రీధర్‌ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  • Published Feb 21, 2024 | 2:51 PMUpdated Feb 21, 2024 | 2:51 PM
మంత్రి కీలక వ్యాఖ్యలు.. త్వరలోనే ధరణి స్థానంలో కొత్త వెబ్‌పోర్టల్‌

గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ఆస్తి నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు 2020, అక్టోబర్‌లో ధరణి పోర్టల్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ఆస్తి రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా.. ల్యాండ్ మ్యూటేషన్, ల్యాండ్ రికార్డుల సెర్చ్, ఇతర భూ సంబంధిత సేవలన్ని లభ్యమయ్యేవి. ఈ పోర్టల్‌ ప్రధాన ఉద్దేశం.. భూమి పత్రాలను డిజిటల్‌గా తీసుకువచ్చి పారదర్శకత పెంచడమే కాక.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఆఫీసులలో మోసాలు తగ్గుతాయని భావించారు. కానీ వాస్తవంగా చూసుకుంటే అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ధరణి పోర్టల్‌లో ఉన్న లోపాల వల్ల జనాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు ధరణి వెబ్‌సైట్‌ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. ధరణి స్థానంలో కొత్త వెబ్‌పోర్టల్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. తప్పుడు పత్రాలతో సర్కారు భూములను కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాక ధరణి పోర్టల్‌లో లోపాలతో లక్షల మంది రైతులు, భూములున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఒకే సర్వే నంబరులో పార్ట్‌-బి పేరుతో ఉన్న భూములపై విచారణ చేసి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ఖైరతాబాద్‌లో మంగళవారం నాడు.. రంగారెడ్డి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. దీనిలో పాల్గొన్న శ్రీధర్‌బాబు.. ధరణి సమస్యలపై ప్రత్యేకంగా మాట్లాడారు. రంగారెడ్డి జిల్లాలోనే ధరణి సంబంధిత సమస్యలు వేల సంఖ్యలో ఉన్నాయని.. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని ఆయన తెలిపారు. అంతేకాక ఏకకాలంలో వీటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని.. తప్పుడు పత్రాలతో సర్కారు భూములను సొంతం చేసుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలానే వారికి సాయం చేసిన అధికారులు, సిబ్బందిపై కూడా చర్యలు తప్పవన్నారు.

ఈ సమావేశంలో కొందరు మాట్లాడుతూ.. హైదరాబాద్‌ శివారులోని కొన్ని గ్రామాల్లో రైతులు, దళితులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న సీలింగ్‌ భూములను.. ధరణి పోర్టల్‌ వచ్చాక ప్రైవేటు పట్టా భూములుగా మార్చారని మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకువచ్చారు. పట్టా వచ్చాక వాటిని విక్రయించారని.. దాంతో ఏళ్ల తరబడి ఆ భూమిలో సాగుచేసుకుంటున్నవారు కలెక్టర్‌ కార్యాలయాల చట్టూ తిరుగుతున్నారని.. అయినా ఫలితం ఉండడంలేదని వివరించారు. అంతేకాక రైతుల భూములను నిషేధిత భూముల జాబితాలోకి మార్చేశారని మంత్రికి తెలిపారు. ఈ సమస్యలు విన్న శ్రీధర్‌ బాబు వాటిపై స్పందిస్తూ.. త్వరలోనే వీటిని పరిష్కరిస్తాం అని తెలిపారు.

అలానే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే గృహజ్యోతి, మహాలక్ష్మిలోని మిగిలిన పథకాలను ప్రారంభించనున్నామని వెల్లడించారు. 200 యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగించేవారి నుంచి ఛార్జీలు వసూలు చేయబోమని, గ్యాస్‌ సిలిండర్‌కు రూ.500 రాయితీ ఇస్తామని తెలిపారు.