Dharani
TS Inter Exam Results 2024: తెలంగాణలో ఒక్క రోజులోనే ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఏంటి.. ఎందుకు ఇంత దారుణ నిర్ణయం తీసుకున్నారు అంటే..
TS Inter Exam Results 2024: తెలంగాణలో ఒక్క రోజులోనే ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఏంటి.. ఎందుకు ఇంత దారుణ నిర్ణయం తీసుకున్నారు అంటే..
Dharani
జీవితం అంటే ఏంటి.. కష్టసుఖాల కలబోత. రోజుకు రాత్రి, పగలు ఎలానే మన జీవితంలో కష్టం, సుఖం కూడా అలానే ఉంటాయి. అయితే పరిస్థితి ఏదైనా సరే.. దాన్ని తట్టుకుని ధైర్యంగా ముందుకు సాగాలి. కష్టాలను దాటుకుని, ఒడిదుడుకును ఎదుర్కొని.. ధైర్యంగా నిలబడ్డ వారే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కానీ నేడు సమాజంలో పరిస్థితులు అలా లేవు. చిన్న చిన్న సమస్యలకు కూడా భయపడి దారుణ నిర్ణయం తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఆఖరికి పరీక్షల్లో ఫెయిల్ అయినా సరే.. ఇక జీవితమే లేదనుకుని.. తల్లిదండ్రులు, సమాజం ఏమాంటారో అనే భయంతో.. ఫెయిల్యూర్‌ని అవమానంగా భావించి.. అతి చిన్న వయసులోనే ఆత్మహత్య వంటి దారుణాలకు పాల్పడతున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇక జీవితం లేదా. చనిపోవాల్సిందేనా.. అసలు అంత చిన్న పిల్లల మనసులో ఇలాంటి దారుణ నిర్ణయాలు తీసుకునే విధంగా ఎవరు ప్రోత్సాహిస్తున్నారు.. విద్యార్థులను బలి తీసుకుంటున్న ఈ పాపం ఎవరిది.. దీనికి ఎవరు సమాధానం చెబుతారు అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బుధవారం, ఏప్రిల్ 24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. పాస్ అయిన విద్యార్థులు సంతోషంగా ఉంటే.. ఫెయిల్ అయిన వారు బాధపడుతున్నారు. ఇక కొందరు విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే కారణంతో.. దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ఫెయిలైన విద్యార్థులు ఆరుగురు కాగా.. మరో స్టూడెంట్.. ఫెయిల్ అవుతానే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
చనిపోయిన ఏడుగురు విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్‌కు చెందిన సాయితేజ గౌడ్ (17), హైదరాబాద్ అత్తాపూర్‌కు చెందిన హరిణి, మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచ్చులాపూర్ గ్రామానికి చెందిన మైదం సాత్విక్, మంచిర్యాల జిల్లా దొరగారిపల్లెకు చెందిన గట్టిక తేజస్విని, ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన వాగదాని వైశాలి, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన చిప్పా భార్గవి అనే విద్యార్థులు ఉరేసుకుని.. బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఇక సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పతూరు గ్రామానికి చెందిన ఒకేషనల్ ఫస్టియర్ విద్యార్థిని శ్రీజ పరిస్థితి అయితే మరీ దారుణం. ఫలితాలు రాకముందే.. ఫెయిలైతే అందరి ముందు అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి.. ఆత్మహత్య ప్రయత్నం చేసింది. విషయం గమనించిన తల్లిదండ్రులు.. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఇక్కడ దురదృష్టకరమైన అంశం ఏంటి అంటే.. శ్రీజ పరీక్ష ఫలితాల్లో ఆమె పాసైనట్లు తెలిసింది. విద్యార్థులు తీసుకున్న నిర్ణయాలతో.. వారు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇక జీవితమే లేదా.. చనిపోవాల్సిందేనా.. బతకలంటే ఎగ్జామ్స్‌లో పాస్ కావల్సిందేనా.. ఇందరు విద్యార్థులను బలి తీసుకున్న ఈ పాపం ఎవరిది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.