Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఆరు గ్యారెంటీల అమలుకు కార్యచరణ వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో 500లకే గ్యాస్ సిలిండర్‌కు సంబంధించి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి రెండు ప్రతి పాదనలు చేసింది. ఆ వివరాలు..
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఆరు గ్యారెంటీల అమలుకు కార్యచరణ వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో 500లకే గ్యాస్ సిలిండర్‌కు సంబంధించి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి రెండు ప్రతి పాదనలు చేసింది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణ ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. దీనిలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీలో ఉచిత జర్నీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, నెలకు 2500 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా ఆరు గ్యారెంటీల అమలుపై సంతకం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, చేయూత, ఆరోగ్య శ్రీని 10 లక్షలకు పెంచడం వంటివి అమలు చేయగా.. మిగతా హామీల అమలు కోసం కార్యచరణ వేగవంతం చేసింది.
ఇక ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న హామీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. వంద రోజుల్లోపు ఆరు గ్యారెంటీలన్నింటిని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించగా.. ప్రస్తుతం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అమలు కోసం మార్గదర్శకాలు రూపొందించే పనిలో బిజీగా ఉంది. దానికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయాలని పౌరసరఫరాలశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం పౌర సరఫరాల శాఖ 2 రకాల ప్రతిపాదనలను సిద్ధం చేసింది. రేషన్ కార్డు ఉన్నవారితోపాటు లేనివారిలో కూడా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రతిపాదించారు అధికారులు. అయితే ముందుగా రేషన్‌కార్డులతో నిమిత్తం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులు సూచించారట.
ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. హెచ్‌పీసీఎల్ నుంచి 43.40 లక్షలు.. ఐఓసీఎల్ నుంచి 47.97 లక్షలు, బీపీసీఎల్ నుంచి 29.04 లక్షల వినియోగదారులు ఉన్నారు. అయితే 1.20 కోట్ల వినియోగదారుల్లో 44 శాతం మంది.. ప్రతి నెలా గ్యాస్ బుక్ చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే 52.80 లక్షల మంది ప్రతి నెలా ఒక గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు.
ఇక తెలంగాణలో ప్రస్తుతానికి 89.99 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డు ఉండగా.. మొదటి ప్రతిపాదన ప్రకారం వారికి ఈ మహాలక్ష్మి పథకాన్ని అమలుచేయవచ్చని అధికారులు గుర్తించారు. అయితే కొందరు అనర్హులు కూడా లబ్ధిదారులు అయ్యే అవకాశం ఉంటుందని.. అంటే ముందుగా సుమారు కోటి మందికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సి రావొచ్చని అధికారులు అంచాన వేస్తున్నారు.
ఇక రెండో ప్రతిపాదనను లెక్కలోకి తీసుకుంటే దానికి సర్వే చేపట్టి.. లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుందని.. అందుకు ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు అధికారులు. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ ప్రతిపాదనలను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి అందించారు. ఇక అధికారికంగా గురువారం నివేదిక కూడా అందజేశారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.955గా ఉంది. సాధారణ కనెక్షన్లపై ఒక్కోదాని బుకింగ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.40 రాయితీ ఇస్తుండగా.. అదే ఉజ్వల్ కనెక్షన్లు మీద రూ.340 రాయితీ ఇస్తోంది.
తెలంగాణలో 11.58 లక్షల ఉజ్వల కనెక్షన్లు ఉండగా.. ‘గివ్ ఇట్ అప్’లో భాగంగా 4.2 లక్షల మంది వినియోగదారులు రాయితీని వదులుకున్నారు. అయితే మిగిలిన వినియోగదారుల్లో మహాలక్ష్మి పథకానికి ఎవరిని ఎంపిక చేస్తారనే అంశం మీద అదనపు భారం ఆధారపడి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ మహాలక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు ఏడాదికి 6 సిలిండర్లను రూ.500 చొప్పున ఇస్తే.. రూ.2,225 కోట్ల భారం.. అదే ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తే అది రూ.4,450 కోట్ల భార ప్రభుత్వంపై పడనుందని అధికారులు తేల్చారు. త్వరలోనే దీనిపై అధికారులు ప్రకటన చేయనున్నారు.