iDreamPost
android-app
ios-app

సెలబ్రిటీలను కాదని.. అరుదైన అవకాశం దక్కించుకున్న ట్రాన్స్‌జెండర్‌

  • Published Sep 20, 2023 | 12:08 PM Updated Updated Sep 20, 2023 | 12:08 PM
  • Published Sep 20, 2023 | 12:08 PMUpdated Sep 20, 2023 | 12:08 PM
సెలబ్రిటీలను కాదని.. అరుదైన అవకాశం దక్కించుకున్న ట్రాన్స్‌జెండర్‌

సెలబ్రిటీలను కాదని.. ట్రాన్స్‌జెండర్‌ మహిళకు అరుదైన అవకాశం దక్కింది. ప్రస్తుతం ఆమె పేరు తెలంగాణ వ్యాప్తంగా మారు మోగిపోతుంది. మరి ఇంతకు ఏంటా అరుదైన అవకాశం అంటే.. ఎన్నికల ప్రచారకర్తగా ఎంపికవ్వడం. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం వెల్లడించింది. తొలిసారిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రచారకర్తగా ఒక ట్రాన్స్‌జెండర్‌ ఎంపికవ్వడం విశేషం. త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పార్టీలన్ని ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక ఎన్నికల కమిషన్‌ కూడా ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులు ప్రారంభించింది.

ఓటరు నమోదు, సవరణ, మార్పులు, చేర్పులు, ఓటు వినియోగం ప్రయోజనాలు తదితర అంశాలపై జనాలకు అవగాహన కల్పించడమే కాక వారిని చైతన్యం చేయడం కోసం.. ప్రతి సారి ఎన్నికల కమిషన్‌ అనేక ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది. సెలబ్రిటీలు, సామాజిక వేత్తలను తమ ప్రచారకర్తలుగా ఎంపిక చేసి ప్రజల్లో అవగాహన తీసుకొస్తుంది. అయితే ఈసారి అందుకు భిన్నంగా సెలబ్రిటీలను కాదని ఓ ట్రాన్స్‌జెండర్‌కు అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌ ప్రాంతానికి చెందిన ట్రాన్స్‌జెండర్‌ లైలాను ప్రచారకర్తగా ఎంపిక చేసింది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 3,600 మందికిపైగా ఉన్న ట్రాన్స్‌జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు. వారి సమస్యలపై ఎప్పటికప్పడు పోరాటాలు చేస్తూ.. పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఇక ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం జిల్లా అధికారులతో మాట్లాడి వరంగల్‌ ఎంజీఎం హాస్పిటల్‌లో వారంలో ఒక రోజు వారికి ప్రత్యేక క్లినిక్‌ను కూడా ఏర్పాటు చేయించారు. అలా వారి కమ్యూనిటీ శ్రేయస్సుకు పాటుపడుతున్న లైలాను.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రచారకర్తగా నియమించింది.