iDreamPost
android-app
ios-app

రైలు ప్రమాదంలో ట్రాన్స్​జెండర్ మృతి.. ట్రెయిన్​లో నుంచి దిగబోతూ..!

  • Author singhj Published - 09:50 AM, Mon - 31 July 23
  • Author singhj Published - 09:50 AM, Mon - 31 July 23
రైలు ప్రమాదంలో ట్రాన్స్​జెండర్ మృతి.. ట్రెయిన్​లో నుంచి దిగబోతూ..!

సాధారణ ప్రజలు ఎక్కడైనా వెళ్లాలంటే ఎక్కువగా బస్సులను ఆశ్రయిస్తారు. అయితే దూర ప్రయాణాలకు మాత్రం రైళ్లనే ఎంచుకుంటారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లాలన్నా, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణించాలన్నా సాధారణ ప్రజలకు ఠక్కున గుర్తొచ్చేది రైళ్లే. అంతగా అందరి మనసుల్లో చోటు సంపాదించింది ఇండియన్ రైల్వేస్. దేశంలో రోజూ కొన్ని కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు రైళ్లు చేరుస్తున్నాయి. భారత్​లోని దాదాపు ప్రతి మారుమూలకూ ఇండియన్ రైల్వేస్ నెట్​వర్క్ విస్తరించింది. అయితే సురక్షితమైన ప్రయాణంగా భావించే ట్రైన్ జర్నీ ఈమధ్య భయపెడుతోంది.

ఒడిశాలో బాలేశ్వర్​లో కోరమాండల్ ఎక్స్​ప్రెస్​కు జరిగిన ఘోర యాక్సిడెంట్ దరిమిలా ఎక్కడైనా రైలు ప్రమాదం జరిగిందనే వార్త వింటే జనాలు హడలిపోతున్నారు. మూడు ట్రైన్స్ ఢీకొన్న ఈ అత్యంత విషాదకర ఘటనను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. తెలంగాణలోనూ ఇటీవల ఫలక్​నుమా రైలులో మంటలు చెలరేగడం చర్చనీయాంశంగా మారింది. ఇక, రైళ్లు ఎక్కుతూ, దిగుతూ ప్రమాదవశాత్తూ ప్యాసింజర్లు చనిపోయిన ఘటనల గురించి కూడా వార్తల్లో చూస్తూనే ఉంటాం. అలాంటి ఓ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

ట్రాన్స్​జెండర్​గా మారిన ఒక యువకుడు రైలు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటన జనగామ జిల్లా, రఘునాథపల్లిలో ఆదివారం జరిగింది. వరంగల్ జిల్లా, సంగెం మండలం, తూర్పు తండాకు చెందిన బడావత్ భీమా కొడుకు అనిల్ (24) ట్రాన్స్​జెండర్​గా మారారు. హిజ్రాలతో కలసి హైదరాబాద్​లోని శాతవాహన ఎక్స్​ప్రెస్​లో కాజీపేటకు వస్తున్నారు. అయితే మధ్యలో మనసు మార్చుకొని తిరిగి హైదరాబాద్ వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో రఘునాథపల్లి స్టేషన్ దగ్గర రైలు నెమ్మది కావడంతో దిగబోయారు. ట్రెయిన్ దిగే ప్రయత్నంలో దివ్య అలియాస్ అనిల్ రైలు కిందపడి దుర్మరణం చెందారు. ట్రాన్స్​జెండర్ మరణంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని జనగామ రైల్వే కానిస్టేబుల్ నరేష్ చెప్పారు.