iDreamPost

‘ఇంద్ర’ సీన్ రిపీట్.. నగలతో ఉడాయించిన హిజ్రా! అసలు కథ ఏంటంటే?

  • Author Soma Sekhar Published - 04:53 PM, Wed - 9 August 23
  • Author Soma Sekhar Published - 04:53 PM, Wed - 9 August 23
‘ఇంద్ర’ సీన్ రిపీట్.. నగలతో ఉడాయించిన హిజ్రా! అసలు కథ ఏంటంటే?

నేటి ఆధునిక సమాజంలో టెక్నాలజీ పరంగా దూసుకెళ్తున్నా.. కొందరు మాత్రం మూఢనమ్మకాలతో మోసపోతూనే ఉన్నారు. వారి మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకున్న కొందరు మోసగాళ్లు వారిని నట్టేటా ముంచుతున్న ఘటనలు నేటి సమాజంలో కోకొల్లలు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అచ్చం మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమాలో బ్రహ్మానందం మోసం చేసిన సన్నివేశం మాదిరిగానే ఓ వ్యక్తిని బురిడీ కొట్టించింది ఓ హిజ్రా. హిజ్రా మాటలు నమ్మిన ఆ వ్యక్తి ఏకంగా 5 తులాల బంగారం, 5 తులాల వెండి పోగొట్టుకుని లబోదిబో మంటూ విలపిస్తున్నాడు. ఇక అసలు కథలోకి వెళితే..

మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ ‘ఇంద్ర’. ఈ సినిమాలో బ్రహ్మానందం అండ్ టీమ్ పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. ఇక ఈ మూవీలో బ్రహ్మీ కాశీలో ఫేక్ పూజారిగా చెలామణి అయ్యి ఏవీఎస్ కుటుంబాన్ని మోసం చేసి వారి నగలు ఎలా దోచుకున్నాడో మనందరికి తెలిసిందే. ఈ సీన్ ఎన్నిసార్లు చూసినా మనకు బోర్ కొట్టదు. ఇక ఇదే సీన్ ను స్ఫూర్తిగా తీసుకున్నట్లుగా ఉంది ఓ హిజ్రా. అచ్చం ఇంద్ర సినిమాలో లాగానే ఓ యువకుడిని బోల్తా కొట్టించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన మధు అనే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన అబిద్ షేక్ మస్తాన్ అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో హిజ్రాను తన ఇంటికి ఆహ్వానించాడు మధు. కాగా.. మధు ఇంటికి వచ్చిన ఆ హిజ్రా కుటుంబ సభ్యుల ఒంటిపై ఉన్న నగలు చూసింది. ఎలాగైనా వాటిని కొట్టేయాలని ప్లాన్ వేసింది. అందులో భాగంగానే ఇంట్లో దోషం ఉందని, అది మీ అభివృద్దికి అడ్డం పడుతుందని మధుని భయపెట్టింది హిజ్రా. ఈ దోషం తొలగిపోవాలంటే ఇంట్లో అమ్మవారికి అలంకరణ చేసి శాంతి పూజ చేయాలని సూచించింది. ఇది నమ్మిన మధు పూజకు అన్ని ఏర్పాట్లు చేశాడు.

ఈ క్రమంలోనే పూజ మెుదలు పెట్టి, వారి ఒంటిపై ఉన్న 5 తులాల బంగారం, 5 తులాల వెండిని తీసి అమ్మవారికి అలంకరించింది. పూజ తర్వాత అమ్మవారిని పాతి పెట్టి నగలు బయటకి తీస్తే.. మీ దోషం తొలగిపోతుందని వారిని నమ్మించింది. ఇక అమ్మవారి విగ్రహాన్ని పూడ్చిపెట్టడానికి చెరువు గట్టుకు వెళ్లారు మధు, హిజ్రా. కాగా.. మధును చెరువు గట్టు దగ్గర ఉన్న గుడి దగ్గర కూర్చోబెట్టి విగ్రహాన్ని పూడ్చిపెట్టివస్తానని చెప్పి హిజ్రా వెళ్లింది. అయితే చాలా సేపు అవుతున్నప్పటికీ ఆ హిజ్రా రాకపోవడంతో.. చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికాడు మధు. ఆమెకు ఫోన్ కూడా చేశాడు. కానీ ఫలితం లేదు.. దీంతో తాను మోసపోయానని గ్రహించాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరి ఇంద్ర సినిమాలోలాగ ఆ హిజ్రా నగలతో ఉడాయించిన సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: బీర్ తాగుతూ సూచనలు ఇచ్చిన తండ్రి.. ఫ్లైట్ నడిపిన 11 ఏళ్ల పిల్లాడు! చివరికి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి