iDreamPost
android-app
ios-app

రాఖీ పండుగ వేళ.. ఆడపడుచులకు TGSRTC బంపరాఫర్‌..

  • Published Aug 10, 2024 | 10:43 AM Updated Updated Aug 10, 2024 | 10:43 AM

TGSRTC Cargo-Rakhi Transportation: రాఖీ పండుగ సందర్భంగా.. టీజీఎస్‌ఆర్టీసీ.. బంపరాఫర్‌ ప్రకటించింది. ఇంతకు దేని గురించి అంటే..

TGSRTC Cargo-Rakhi Transportation: రాఖీ పండుగ సందర్భంగా.. టీజీఎస్‌ఆర్టీసీ.. బంపరాఫర్‌ ప్రకటించింది. ఇంతకు దేని గురించి అంటే..

  • Published Aug 10, 2024 | 10:43 AMUpdated Aug 10, 2024 | 10:43 AM
రాఖీ పండుగ వేళ.. ఆడపడుచులకు TGSRTC బంపరాఫర్‌..

సరి కొత్త నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ ఆర్టీసీ ఎల్లప్పుడు రెడీగా ఉంటుంది. ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అమలు చేస్తోంది. దాంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆర్టీసీ సంస్థ కూడా కొత్త బస్సులను కొనుగోలు చేయడం, సిబ్బందిని పెంచుకోవడం వంటి చర్యలను తీసుకుంటుంది. అలానే పర్యావరణ హితం కోసం.. ఎలక్ట్రిక్‌ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక పండుగల వేళ.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. అందుకు తగ్గట్టుగా సర్వీసులను పెంచుతూ ప్యాసింజర్స్‌కు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తోంది. ఇక త్వరలోనే రాఖీ పండుగ ఉంది. ఈ సందర్భంగా టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆవివరాలు..

టీజీఎస్‌ఆర్‌టీసీ ఆడపడుచులకు బంపరాఫర్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఆగస్టు 19న రక్షా బంధన్ సందర్భంగా ఆర్టీసీ లాజిస్టిక్స్ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాఖీ పండుగకు నాలుగైదు రోజుల ముందే ప్రత్యేక కౌంటర్లను తెరవాలని అధికారులు భావిస్తున్నారు. రక్షా బంధన్ సందర్భంగా ఆడపడుచులు.. వారి సోదరులకు రాఖీలు కట్టడం ఆనవాయితీ. అయితే కొందరు పుట్టింటికి, అన్నదమ్ములకు చాలా దూరంగా ఉంటూ వారి వద్దకు వెళ్లలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారు పోస్ట్ లేదా కొరియర్ సర్వీసుల ద్వారా తమ అన్నదమ్ములకు రాఖీలు పంపేవారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ అధికారులు రాఖీలను రవాణా చేయడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

రాఖీలతో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు, ఇతర సామగ్రిని కూడా రవాణా చేయనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు రాఖీలను రవాణా చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా కార్గో సర్వీసులు నిర్వహిస్తున్న అన్ని డిపోల్లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాఖీలు బుక్ చేసుకున్న 24 గంటల్లో గమ్యస్థానానికి చేరవేసేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రాఖీల రవాణా ధర ఇంకా ఖరారు కాకపోవడంతో ఉన్నతాధికారుల అనుమతి కోసం వేచి చూస్తున్నారు. మరి ఈ ధర ఎంత ఉండనుంది అనేది త్వరలోనే తెలియనుంది.

సోమవారం నాటికి రాఖీల రవాణా ధరపై స్పష్టత వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కరీంనగర్ రీజియన్ లాజిస్టిక్స్ మేనేజర్ రామారావు తెలంగాణ టుడేతో మాట్లాడుతూ పండుగకు నాలుగైదు రోజుల ముందే ప్రత్యేక కౌంటర్లు తెరిచి బుకింగ్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపారు. పట్టణాల్లోని గమ్యస్థానాలకు 24 గంటల్లోగా రాఖీలు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు.