iDreamPost
android-app
ios-app

వరదల్లో అన్నీ కోల్పోయిన స్నేహితుడికి టెన్త్‌ క్లాస్‌మేట్స్‌ సాయం!

వరదల్లో అన్నీ కోల్పోయిన స్నేహితుడికి టెన్త్‌ క్లాస్‌మేట్స్‌ సాయం!

ప్రతీ మనిషి జీవితంలో బాల్యం ఓ మధురమైన జ్ఞాపకం.. అందులోనూ టెన్త్‌ ఎప్పటికీ గుర్తుండిపోయే దశ. ఈ దశలో మన జీవితంలోకి వచ్చిన స్నేహితులు మనపై ఎలాంటి ప్రభావం చూపుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి మన జీవితాంతం తోడుండే బెస్ట్‌ ఫ్రెండ్స్‌ కూడా ఇక్కడినుంచే మొదలవుతారు. మనకు అవసరం ఉన్నపుడు.. లేదా మనం ఆపదలో ఉన్నపుడు ఆదుకోవాటానికి కూడా ఈ ఫ్రెండ్షిప్‌ సహాయపడుతూ ఉంటుంది. తాజాగా, వర్షాల కారణంగా సర్వం కోల్పోయిన ఓ వ్యక్తికి టెన్త్‌ ఫ్రెండ్స్‌ అండగా నిలిచారు.

అతడిని ఆదుకునేందుకు ఆర్థిక సాయం చేశారు. ఈ సంఘటన తెలంగాణలోని ములుగులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలంగాణలో కొద్దిరోజుల క్రితం ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలోని గోవిందరావు పేట మండలం పసరా గ్రామానికి చెందిన లకావత్‌ ఉమేష్‌ ఇళ్లు పూర్తిగా వరదల్లో కొట్టుకుపోయింది. అసలే నిరుపేద కుటుంబం.. ఉన్న గూడు కాస్తా వరదల్లో కొట్టుకుపోవటంతో ఉమేష్‌ పరిస్థితి దారుణంగా తయారైంది. తిండికి కూడా తిప్పలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక, ఉమేష్‌ పరిస్థితి అతడి టెన్త్‌ క్లాస్‌మేట్స్‌ దృష్టికి వెళ్లింది.

2009లో ఉమేష్‌ టెన్త్‌ పూర్తి చేయగా.. టెన్త్‌ క్లాస్‌మేట్స్‌ మొత్తం వాట్సాప్‌ గ్రూపులో ఒకరితో ఒకరు టచ్‌లో ఉన్నారు. ఆ వాట్సాప్‌ గ్రూపులోనే ఉమేష్‌కు ఆర్థిక సాయంపై చర్చ జరిగింది. తలా కొంత వేసి తమ మిత్రుడ్ని ఆదుకోవాలని వారు నిర్ణయించారు. దాదాపు 30 వేల రూపాయలు పోగేసి ఉమేష్‌కు అందించారు. అది చిన్న మొత్తమే అయినా.. తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న అతడికి ఓ భారీ సహాయమే. కాగా, ఉమేష్‌ టెన్త్‌ క్లాస్‌మేట్స్‌ చేసిన పనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. మరి, కష్టాల్లో ఉన్న మిత్రుడ్ని ఆదుకున్న ఈ టెన్త్‌ క్లాస్‌మేట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.