P Venkatesh
ఇటీవల టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్స్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఓ గృహిణి హోటల్ నిర్వహిస్తూనే రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది.
ఇటీవల టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్స్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఓ గృహిణి హోటల్ నిర్వహిస్తూనే రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది.
P Venkatesh
శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అన్న వ్యాఖ్యలు అక్షరాల నిజం చేస్తున్నారు నేటి మహిళలు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు మోస్తూనే మరో వైపు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు నిరంతర కృషి చేస్తున్నారు. చేసే పని పట్ల శ్రద్ధ, అంకితభావం కనబరుస్తూ వంటింటి నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన పలు ఉద్యోగ ఫలితాల్లో సత్తా చాటారు మహిళలు. కోచింగ్ లేకున్నా, ఖాళీ సమయాల్లో చదువుకుంటూ ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలను సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదే విధంగా ఓ గృహిణి భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ.. కుటుంబ పోషణ కోసం హోటల్ నిర్వహిస్తూ రెండు ఉద్యోగాలను సాధించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగాలకు కాంపిటీషన్ ఎలా ఉందో వేరే చెప్పక్కర్లేదు. ఏ చిన్నా జాబ్ నోటిఫికేషన్ అయినా సరే వేల సంఖ్యలో పోటీపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక్క జాబ్ రావడమే గొప్ప అనుకుంటే ఏకంగా రెండు ఉద్యోగాలు సాధించి సక్సెస్ కు నిదర్శనంగా నిలిచింది. ఆమె మరెవరో కాదు.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన జ్యోతి. ఎంఏ, బీఈడీ పూర్తి చేసిన జ్యోతి భర్త నవీన్ తో కలిసి హోటల్ నిర్వహిస్తోంది. దీంతో ఆమె సంతృప్తి చెందలేదు. ఎలాగైనా చదివిన చదువుకు సార్థకం చేకూరాలంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పట్టుబట్టింది. తన కుటుంబాన్ని పేదరికం నుంచి గట్టేక్కించాలని నిరంతరం తాపత్రయపడింది.
తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఓవైపు హోటల్ నిర్వహిస్తూనే ఖాళీ సమయాల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో గత సంవత్సరం ఆగస్టులో టీజీటీ, పీజీటీ ఉద్యోగాలతో పాటు జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు పరీక్ష రాసింది గృహిణి జ్యోతి. వీటికి సంబంధించిన ఫలితాలు వారం కిందట వెలువడగా పీజీటీ ఫలితాల్లో జ్యోతి ఉద్యోగం సాధించింది. దీంతో పాటు ఇటీవల ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి కూడా ఎంపికైంది. ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో జ్యోతి కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. కుటుంబ సభ్యుల ఆనందానికి అడ్డే లేదు. కుటుంబ బాధ్యతల్లో పాలుపంచుకుంటూ రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన జ్యోతిపై సర్వాత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.