iDreamPost
android-app
ios-app

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! టీచర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ షురూ

  • Published Aug 17, 2023 | 9:35 AM Updated Updated Aug 17, 2023 | 9:35 AM
  • Published Aug 17, 2023 | 9:35 AMUpdated Aug 17, 2023 | 9:35 AM
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! టీచర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ షురూ

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 5500 టీచర్‌ పోస్టులు భర్తీ చేసేందుకు కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జులై 7న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో రాష్ట్రవ్యాప్తంగా 9,370 టీచర్‌ పోస్టుల ఖాళీ ఉన్నట్లు గుర్తించారు.

వీటిని టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) ద్వారా భర్తీ చేయాల్సి ఉందని, ఐదు వేల మంది మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినా.. కూడా నియామకాలు పూర్తయ్యే వరకు 13,684 మంది విద్యా వాలంటీర్ల అవసరం ఉందని విద్యాశాఖ ప్రతిపాదించింది. ఇలా అన్ని విషయాలను పరిశీలించాక.. 5500 పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు సమాచారం.

అయితే.. వచ్చే నెల అంటే సెప్టెంబర్‌ 15న టెట్‌ నిర్వహిస్తున్నందున, ఆ పరీక్ష ఫలితాలు వెల్లడించిన తర్వాత.. టీఆర్‌టీ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కొత్త పోస్టుల భర్తీ ప్రక్రియ ఎంత కాదన్నా.. 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది. సెప్టెంబర్‌ నెలాఖరులో నియామక నోటిఫికేషన్‌ జారీ చేసినా.. కొత్త టీచర్లు విధుల్లో చేరే సరికి 2024-25 విద్యా సంవత్సరం వచ్చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ చాలా కాలంగా లేదు. తాజా ప్రాథమిక ప్రకటనతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి.

ఇదీ చదవండి: పంద్రాగస్టు రోజున.. శుభవార్త చెప్పిన CM KCR!