Dharani
అన్నదాతలకు శుభవార్త. త్వరలోనే వారి ఖాతాలో నగదు జమ కానుంది. అది కూడా ఎకరాకి రూ.10 వేలు. ఇంతకు ఈ డబ్బులు దేనికి సంబంధించినవి అంటే..
అన్నదాతలకు శుభవార్త. త్వరలోనే వారి ఖాతాలో నగదు జమ కానుంది. అది కూడా ఎకరాకి రూ.10 వేలు. ఇంతకు ఈ డబ్బులు దేనికి సంబంధించినవి అంటే..
Dharani
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. తెలంగాణలో కేవలం పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఏపీలో మాత్రం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో దశలో భాగంగా మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంక్షేమ పథకాలు ఆగిపోయాయి. దాంతో తెలంగాణలో రైతుల ఖాతాలో డబ్బులు వేసే ప్రక్రియ కూడా ఆగిపోయింది. అయితే అధికారులు ఎన్నికల కమిషన్ అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని.. ఆ పథకం అమలుకు లైన్ క్లియర్ చేశారు. ఈసీ అనుమతి లభించడంతో.. ఇక త్వరలోనే అన్నదాతల ఖాతాలో డబ్బులు జమకానున్నాయి. అవి కూడా ఎకరానికి రూ.10 వేలు కావడం విశేషం. ఇంతకు ఈ డబ్బులు ఏ పథకానికి సంబంధించినవి అనగా..
అన్నదాతల కష్టాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. ప్రభుత్వాలతో పటు ప్రకృతి కూడా రైతన్నలను మోసం చేస్తూ ఉంటుంది. ఓ ఏడాది అసలు వర్షాలే లేకుండా ఇబ్బంది పెడితే.. మరో ఏడాది అతి వృష్టి, వరదలతో ఇబ్బంది పెడుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు వస్తాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది. గత నెల వడగళ్లు, అకాల వర్షాలతో జరిగిన నష్టానికి రైతులకు పరిహారం చెల్లింపునకు ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో పంట నష్టం చెల్లింపుల ప్రక్రియ జరుగుతుందని అధికారులు తెలిపారు. మార్చిలో వడగళ్లు, అకాల వర్షాలకు 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ నిర్ధారించిన సంగతి తెలిసిందే.
మొత్తం పది జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. 15,246 మంది రైతులకు చెందిన వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి అని వెల్లడించింది. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు.. వారందరికీ ఎకరాకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.15.81 కోట్లు పరిహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, గత ప్రభుత్వ హయాంలో గతేడాది ఒకసారి తీవ్రమైన వర్షాలతో పంటలకు నష్టం జరిగినప్పుడు ఎకరాకు రూ. 10 వేలు పరిహారం ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు కూడా పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. తాజాగా ఈసీ అనుమతి ఇవ్వడంతో.. త్వరలోనే అన్నదాతల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి.