Dharani
TG DSC 2024, Group 2-Exam Postponed, Protest: ఉద్యోగాల కోసం ఆందోళన చేసిన తెలంగాణ నిరుద్యోగులు ఇప్పుడు మాత్రం పరీక్షలు వాయిదా వేయాలని పట్టుబట్టి.. రోడ్ల మీదకు వస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగుల డిమాండ్ వినేది లేదు అంటుంది. అసలింతకు రాష్ట్రంలో ఏం జరుగుతుంది.. ప్రభుత్వం ఏమంటుంది.. నిరుద్యోగులు ఏం డిమాండ్ చేస్తున్నారంటే..
TG DSC 2024, Group 2-Exam Postponed, Protest: ఉద్యోగాల కోసం ఆందోళన చేసిన తెలంగాణ నిరుద్యోగులు ఇప్పుడు మాత్రం పరీక్షలు వాయిదా వేయాలని పట్టుబట్టి.. రోడ్ల మీదకు వస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగుల డిమాండ్ వినేది లేదు అంటుంది. అసలింతకు రాష్ట్రంలో ఏం జరుగుతుంది.. ప్రభుత్వం ఏమంటుంది.. నిరుద్యోగులు ఏం డిమాండ్ చేస్తున్నారంటే..
Dharani
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి సుమారు ఎనిమిది నెలలు కావొస్తుంది. ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వంపై ఎక్కడా ఎలాంటి విమర్శలు రాలేదు. ప్రభుత్వ నిర్ణయాలపై జనాలు సానుకూలంగానే ఉన్నారు. కొన్ని హామీల అమలు ఆలస్యం అయినా.. చేస్తారు అనే నమ్మకంతోనే ఉన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ మీద ఆగ్రహంతో ఉన్న నిరుద్యోగులు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు సంతృప్తి చెంది.. ఎన్నికల్లో ఆ పార్టీ వెంట నడిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి రాగానే.. ఉద్యోగాల సంఖ్య పెంచుతామని.. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది.
ఇక అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ.. తమకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తుందని నిరుద్యోగులు ఆశిస్తూ వస్తున్నారు. కానీ ప్రభుత్వ తీరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. నేడు రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు. గ్రూప్ 1 ప్రిలీమ్స్‌లో 1:100 తీయాలని, డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతున్నారు. అందుకోసం రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయడం, సెక్రటేరియట్ ముట్టడి వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.
అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటికే డీఎస్సీ హాల్ టికెట్లును అందుబాటులో ఉంచింది. జూలై 18 నుంచి డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు రెడీ అయ్యింది. అంతేకాక ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కానీ అభ్యర్థులు మాత్రం ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ ప్రారంభంలో డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గ్రూప్ 2 వాయిదా వేయాలని.. పోస్టులు పెంచి.. డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి మొన్నటి వరకు ఉద్యోగాల కోసం ఆందోళన చేసిన అభ్యర్థులు ఇప్పుడేందుకు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు.. ప్రభుత్వం ఎందుకు ససేమీరా అంటుంది అనే దానిపై పూర్తి విశ్లేషణ ఇక్కడ మీ కోసం..
డీఎస్సీ నోటిఫికేషన్ గత ప్రభుత్వ హయాంలోనే విడుదలయ్యింది. 5089 పోస్టులకు గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పోస్టుల సంఖ్య పెంచి.. 11,062 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. మార్చిలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 4 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించింది. ఆ తర్వాత మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ నిర్వహించారు. జూన్ 12న ఫలితాలు వచ్చాయి. టెట్ పేపర్ 1, 2 రెండింటిలో కొత్తగా 50 వేల మంది క్వాలిఫై అయ్యారు. దాంతో జూన్ 20 వరకు అప్లికేషన్ ప్రాసెస్‌ను పొడగించారు. ఇక ఇప్పుడు జూలై 18 నుంచి డీఎస్సీ పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది.
టెట్, డీఎస్సీ మధ్య కనీసం నెల రోజుల వ్యవధి కూడా లేదు. పైగా ఈ రెండు పరీక్షల సిలబస్ పూర్తిగా వేరు. డీఎస్సీ సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి కనీసం 45 రోజుల వ్యవధి ఉండాలి. కానీ డీఎస్సీ పరీక్షకు కనీసం నెల రోజుల వ్యవధి కూడా ఇవ్వకుండా పరీక్షల తేదీలు నిర్ణయించడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే డీఎస్సీ పరీక్షను ఆగస్టు చివరి నాటికి వాయిదా వేయాలని కోరుతున్నారు. ఎగ్జామ్ పోస్ట్‌పోన్ చేస్తే.. కొత్తగా టెట్ క్వాలిఫై అయిన వారికి కూడా డీఎస్సీకి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. అందుకే పోస్ట్‌పోన్ చేయమని నిరుద్యోగులు కోరుతున్నారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. మే నెల నుంచి వరుస పరీక్షలు నిర్వహిస్తూ వచ్చింది.
నిరుద్యోగులు.. మే నుంచి జూలై 4 వరకు వారానికి ఒక పరీక్ష చొప్పున రాస్తున్నారు. జూన్ 2 వరకు టెట్ పరీక్ష నిర్వహించగా.. జూన్ 12న రిజల్ట్ వచ్చింది. జూలై 18 నుంచి డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. అంటే టెట్ రిజల్ట్ నుంచి డీఎస్సీ పరీక్షకు మధ్యలో కనీసం నెల రోజుల వ్యవధి కూడా లేదు. పైగా వేర్వేరు పరీక్షలు నిర్వహించడం.. అన్నింటికి సిలబస్ వేరుగా ఉండటంతో.. కేవలం ఒక్క పరీక్షకు మాత్రమే ప్రిపేర్ అవ్వడం దాదాపు అసాధ్యం. అందుకే డీఎస్సీ అభ్యర్థులు పరీక్ష వాయిదా వేయాలని.. అంతేకాక ఆఫ్‌లైన్‌లో ఎగ్జామ్ నిర్వహించాలని కోరుతున్నారు.
జూలై 18 నుంచి డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈసారి ఆన్‌లైన్‌లో డీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఆగస్టు 5న పూర్తవుతాయి. ఆ తర్వాత ఒక్క రోజు గ్యాప్ మాత్రమే ఉండి. గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యిది. ఆగస్టు 7, 8న గ్రూప్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. అయితే డీఎస్సీ పరీక్ష రాసే వారిలో చాలా మంది గ్రూప్ 2 పరీక్షకు కూడా అప్లై చేశారు. ఇక ఇక్కడ గ్రూప్ 2, డీఎస్సీ సిలబస్‌లు పూర్తిగా వేర్వేరు. ఆగస్టు 5 వరకు డీఎస్సీకి ప్రిపేర్ అయిన అభ్యర్థి.. ఒక్క రోజు వ్యవధిలో గ్రూప్ 2 పరీక్ష సిలబస్‌ను ఎలా కవర్ చేసుకుంటాడు. అందుకే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్‌చేస్తున్నారు. అంతేకాక ఇప్పుడు కేవలం 786 గ్రూప్ 2 పోస్టులు మాత్రమే ఉన్నాయని.. వీటి సంఖ్యను పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
డీఎస్సీ పోస్ట్‌పోన్ మాత్రమే కాక.. గ్రూప్ 2, 3 పోస్టులను పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తే.. జిల్లాకు కనీసం 10 ఉద్యోగాలు కూడా లేవని.. అందుకే పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ కోసం 2022, డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత వేర్వేరు కారణాల వల్ల గ్రూప్ 2, 3 పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇక చివరకు ఈ ఏడాది ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు రెడీ అయ్యింది. గ్రూప్ 3 పరీక్షను నవంబర్‌లో నిర్వహిస్తామని తెలిపింది.
అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే.. డీఎస్సీకి అప్లై చేసిన వారిలో సుమారు 90 శాతం మంది గ్రూప్ 2కి కూడా ప్రిపేర్ అవుతున్నారు. మరి ఆగస్టు 5 వరకు డీఎస్సీకి చదివి.. ఒక్క రోజు వ్యవధిలోనే గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ అవుతారు. పైగా డీఎస్సీ, గ్రూప్ 2 సిలబస్ పూర్తిగా వేరు.. చాలా ఎక్కువ ఉంటుంది. కనుక డీఎస్సీని ఆగస్టు చివరి నాటికి.. గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. కావాలంటే గ్రూప్ 2, 3 సిలబస్ రెండు ఒకే విధంగా ఉన్నాయి కనుక వాటిని వెంటవెంటనే నిర్వహిస్తే ఎలాంటి నష్టం లేదు అంటున్నారు.
నిరుద్యోగుల వాదన ఇలా ఉంటే.. ప్రభుత్వం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తుంది. నిరుద్యోగులు కోరినట్లు.. గ్రూప్ 1 ప్రిలీమ్స్‌లో 1:100 క్వాలిఫై చేస్తే.. మళ్లీ ఈ వ్యాహారం కోర్టుకు చేరుతుందని.. తెలంగాణ వచ్చాక పదేళ్ల కాలంలో ఇప్పటి వరకు గ్రూప్1 పరీక్ష నిర్వహించలేదని.. ఇప్పుడు 1:100 తీస్తే.. మళ్లీ కోర్టు కేసులు అవుతాయని చెబుతుంది. దాంతో పరీక్ష నిర్వహణ మరింత ఆలస్యం అవుతుందని.. దాని వల్ల సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు నష్టపోతారని ప్రభుత్వం చెబుతూ వస్తోంది.
అలానే డీఎస్సీ కోసం కూడా ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారని.. ఇప్పుడు దాన్ని మరోసారి పోస్ట్‌పోన్ చేస్తే.. ఎన్నో ఏళ్లుగా ప్రిపేర్ అవుతున్న వారు నష్టపోతారని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టులను భర్తీ చేస్తే.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు అవకాశం లభిస్తుందని.. ఇప్పుడు ఉద్యోగం రాని వారు ఆ పోస్టులకు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. పరీక్షలను వాయిదా వేస్తూ పోతే నిరుద్యోగులకు కాలయాపన తప్ప అదనపు ప్రయోజనం ఉండదని అంటుంది. అందుకే ఈ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తి లేదని.. వీటిని పూర్తి చేసి.. తాము ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాల భర్తీని నెరవేరుస్తామని చెబుతున్నారు.