iDreamPost
android-app
ios-app

అప్రమత్తంగా ఉండండి.. రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు!

అప్రమత్తంగా ఉండండి.. రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు!

రాష్ట్రంలో ఇంకా వర్షాలు తగ్గుముఖం పట్టలేదు. మూడ్రోజుల క్రితం మొదలైన వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని శాఖల అధికాలుతో సీఎస్ శాంతి కుమారి అత్యవసర సమావేశం నిర్వహించారు. రానున్న 48 గంటల్లో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. దక్షిణ తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పాఠశాలలకు విద్యాశాఖ రెండ్రోజులు సెలవులు ప్రకటించింది.

వర్షాల నేపథ్యంలో 40 మంది సభ్యులు గల ఎన్డీఆర్ ఎఫ్ బృందం అందుబాటులో ఉంది. హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల కోసం వరంగల్, ములుగు, కొత్తగూడెంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టుల్లో 50 శాతం మేర నీరు మాత్రమే ఉన్నందున.. భారీ వరదలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. పల్లెటూర్లలో రోడ్డు మార్గాలు, చెరువులు, కుంటలు అన్నీ బాగానే ఉన్నాయని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడలేదని చెప్పారు.

జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 426 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అందుబాటులో ఉన్నాయి. వాటికి అదనగంా 157 స్టాటిక్ టీంలను కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 185 చెరువులో, కుంటలపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు వైద్యారోగ్య శాఖ కూడా వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉంది. ముఖ్యంగా గర్భిణీల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్య సేవల విషయంలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేలా చూసుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అవసరమైతే హెలికాప్టర్ సేవలను సైతం వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

అంతేకాకుండా వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు తగిన సూచనలు కూడా చేశారు. ఎవరూ అవసరం లేకుండా రోడ్ల పైకి రావొద్దని తెలిపారు. రోడ్డుపై నడిచే వాళ్లు మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నాయా? ఫుట్ పాత్ పై కరెంట్ తీగలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను పరిశీలించుకుని వెళ్లాలని సూచించారు. విద్యుత్ స్తంభాల విషయంలో కూడా జాగ్రత్త వహించాలనన్నారు. ఎవరూ కూడా రోడ్లపై పడి ఉన్న వైర్లను తాకడం వంటివి చేయకూడని హెచ్చరించారు. ఈ ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ కూడా అప్రమత్తమైంది. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగి ఉంటే.. 1912, 100, 7382071574, 7382072106, 7382072104 టోల్ ఫ్రీ, కంట్రోల్ నంబర్లకు సమాచారం అందిచాలని కోరారు.