P Venkatesh
నిరుద్యోగులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే శుభవార్తను అందించనున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లో ఉద్యోగాల భర్తీపై సమీక్ష నిర్వహించనున్నారు.
నిరుద్యోగులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే శుభవార్తను అందించనున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లో ఉద్యోగాల భర్తీపై సమీక్ష నిర్వహించనున్నారు.
P Venkatesh
తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రెండు గ్యారంటీలను ప్రారంభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను ప్రారంభించి అమలు చేస్తున్నారు. వాటిలో ఒకటి మహాలక్ష్మీ పథకం. మరొకటి ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రూ. 10 లక్షలకు పెంచారు. ఇక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించారు. త్వరలోనే భారీగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాల్లో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించడమే గాని వాటి ప్రక్రియను మాత్రం పూర్తి చేసింది లేదు. ప్రతిష్టాత్మకమైన గ్రూప్ 1 వంటి పరీక్ష పేపర్లు లీక్ కావడం, పరీక్షలు వాయిదా పడడం నిరుద్యోగులను మరింత అసహనానికి గురయ్యేలా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి నియామకాలను గాలికొదిలేశారని తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రెఢీ అవుతున్నారు.
దీనిలో భాగంగానే రెండు రోజుల్లో సమీక్ష నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఇప్పటి వరకు భర్తీ అయిన ఉద్యోగాల వివరాలు, నోటిఫికేషన్ల వివరాలతో రివ్యూ మీటింగ్ కు రావాలని సీఎంవో కార్యాలయం టీఎస్పీఎస్సీ చైర్మన్ ను ఆదేశించింది. మరి ఈ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకోబోయే నిర్ణయాలపై యువతలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు వాయిదా పడిన పరీక్షలను నిర్వహిస్తారా? లేదా టీఎస్పీఎస్సీపై చర్యలు తీసుకున్నాకే పరీక్షలను నిర్వహిస్తదా అన్న అంశం కీలకంగా మారింది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్తను అందిస్తూ భారీ ప్రకటన చేస్తారంటూ జోరుగా చర్చ జరుగుతోంది. మరి ఉద్యోగాల భర్తీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.