iDreamPost
android-app
ios-app

మంచిర్యాల వ్యక్తికి వింత సమస్య.. పురుషుడి కడుపులో గర్భసంచి

  • Published Aug 23, 2023 | 2:29 PM Updated Updated Aug 23, 2023 | 2:29 PM
  • Published Aug 23, 2023 | 2:29 PMUpdated Aug 23, 2023 | 2:29 PM
మంచిర్యాల వ్యక్తికి వింత సమస్య.. పురుషుడి కడుపులో గర్భసంచి

స్త్రీ, పురుషులకు శరీర నిర్మాణం వేర్వురుగా ఉంటుంది. వారు వారు నిర్వర్తించే పనులకు తగ్గట్టుగా ఆడ, మగ శరీర నిర్మాణాలు వేర్వేరుగా ఉంటాయి. అలా కాకుండా.. మగ వారిలో స్త్రీల శరీర భాగాలు.. స్త్రీలలో పురుషుల శరీర భాగాలు ఉంటే.. అంది ప్రకృతికి విరుద్ధం. ఇదిగో ఇలాంటి వింత సంఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది. సాధారణంగా గర్భసంచి స్త్రీలకు ఉంటుంది. అందువల్లే.. వారు ఒక బిడ్డకు జన్మనివ్వగలరు. ఇక తాజాగా సోహైల్‌ హీరోగా మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. దీనిలో హీరో.. ప్రెగ్నెంట్ అవుతాడు. సినిమా కాబట్టి.. ఇలాంటి వింతలు ఎన్ని చూపించినా ఏం కాదు. కానీ తాజాగా ఈ రీల్‌ సీన్‌ కాస్త రియల్‌గా చోటు చేసుకుంది. పురుషుడి శరీరంలో గర్భసంచిని గుర్తించారు వైద్యులు. ఆ వివరాలు..

మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఈ వింత సమస్యతో బాధపడుతున్నాడు. ఈ వ్యక్తి కడుపులో డాక్టర్లు గర్భసంచిని గుర్తించారు. కిమ్స్‌ ఆసుపత్రి కన్సల్టెంట్‌ యురాలజిస్టు, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ప్రశాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి వివాహమై ఏళ్లు గడుస్తోంది. అయినా ఇప్పటి వరకు ఆ దంపతులకు పిల్లలు పుట్టలేదు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా సమస్య ఏంటో తెలియలేదు. ఇక ఇటీవల బాధితుడి పొత్తి కడుపు కింద తీవ్రమైన నొప్పి రావడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. వారి సూచన మేరకు.. బాధితుడు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో జాయిన్‌ అయ్యాడు.

కిమ్స్‌లో డాక్టర్లు బాధితుడికి అల్ట్రాసౌండ్‌ సహా వివిధ టెస్టులు నిర్వహించారు. అయితే అతనిలోని పురుషాంగం సాధారణంగానే ఉన్నప్పటికీ.. వృషణాలు మాత్రం పుట్టినప్పటి నుంచి ఉదరభాగంలోనే ఉండిపోయినట్లు గుర్తించారు. అలాగే స్త్రీలలో మాదిరిగానే గర్భసంచి, ఫాలోపియన్‌ ట్యూబ్‌లు, స్త్రీ జననాంగంలోని కొంతభాగం అదే ప్రాంతంలో ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతిలో లోపల ఉన్న వృషణాలు, ఫాలోపియన్‌ ట్యూబులు, గర్భసంచి, స్త్రీ జననాంగం తొలగించారు.

కడుపులో పిండం ఏర్పడేటప్పుడు రెండు రకాల అవయవాలు ఉన్నా.. ఆ తర్వాత హార్మోన్ల ప్రభావంతో ఏదో ఒకటే అభివృద్ధి చెందుతుందని తెలిపారు వైద్యులు. అయితే అరుదైన కేసుల్లో జన్యు ఉత్పరివర్తనం కారణంగా అవసరమైన హార్మోన్లు తగినంత స్థాయిలో విడుదల కాకపోవడంతో స్త్రీ, పురుష పునరుత్పత్తి అవయవాలు రెండూ అభివృద్ధి చెందుతాయన్నారు. దీన్నే మెడికల్ పరిభాషలో పెర్సిస్టెంట్‌ ముల్లేరియన్‌ డక్ట్‌ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తారని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు.