iDreamPost
android-app
ios-app

దసరాకు ఊరికి వెళ్లే వారు ఆ బస్సులు ఎక్కొద్దు!

దసరాకు ఊరికి వెళ్లే వారు ఆ బస్సులు ఎక్కొద్దు!

దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా ఊరికి వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ మేరకు పెద్ద సంఖ్యలో బస్సులను తిప్పాలని నిశ్చయించుకుంది. 13నుంచి 24వ తేదీ వరకు ఏకంగా 5,265 బస్సుల్ని దసరా ప్రయాణాల కోసం వినియోగించనుంది. ప్రయాణికుల భద్రత విషయంలోనూ టీఎస్‌ఆర్టీసీ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే పండుగకు ఊరెళ్లేవారికి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక సూచన చేశారు.

వైట్ నెంబర్‌ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి.. ఇబ్బందులు పడొద్దని విజ్ఞప్తి చేశారు. టీఎస్ఆర్టీసీలో ఎంతో అనుభవంగల డ్రైవర్లు ఉన్నారని, వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని అన్నారు. మంగళవారం పోలీస్, రవాణా శాఖ అధికారుల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఈ నెల 20 నుంచి 23 వరకు అధికంగా రద్దీ ఉండే అవకాశముంది. అందుకే ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నాం. అదనంగా 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించాం.

రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక బస్సులను నడుపుతున్నాం. గత సంవత్సరం కంటే.. ఈ సారి దాదాపు 1000 బస్సులను అదనంగా తిప్పుతున్నాం. గమ్యం ట్రాకింగ్ యాప్‌ను ఉపయోగించి.. మీ సమయాన్ని సేవ్‌ చేసుకోండి. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించిన వివరాల కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నెంబర్లు 040-69440000, 040-23450033లకు ఫోన్‌ చేయండి’’ అని అన్నారు. వైట్ నెంబర్‌ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి.. ఇబ్బందులు పడొద్దంటూ టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చేసిన విజ్ఞప్తిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.