iDreamPost
android-app
ios-app

ప్రయాణికులతో సహ RTC బస్సు చోరీ.. ఏం జరిగిందంటే!

  • Published Sep 11, 2023 | 12:53 PM Updated Updated Sep 11, 2023 | 1:03 PM
ప్రయాణికులతో సహ RTC బస్సు చోరీ.. ఏం జరిగిందంటే!

ఈ మద్య చాలా మంది ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ కష్టం లేకుండా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారిని మోసం చేయడం, స్మగ్లింగ్, చోరీలు, బెదిరింపుల, హైటెక్ వ్యభిచారం ఇలా ఎన్నో రకాలుగా డబ్బులు సంపాదించే పనిలో ఉన్నారు. సాధారణంగా దొంగలు బంగారం, డబ్బులు ఇతర విలువైన సామాగ్రి దొంగతనం చేయడం చూస్తుంటారు. కానీ ఓ దొంగ మాత్రం ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేశాడు. అది కూడా అందులో ప్రయాణికులు ఉన్న సమయంలో.. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

సిద్దిపేట జిల్లా బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బయలుదేరింది. బస్సు నడుపుతున్న డ్రైవర్ బస్సును నడిపే తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. రోడ్డుపై ఇష్టమొచ్చినట్లు నడుపుతూ వెళ్లిన ఆ డ్రైవర్ జిల్లెళ్ల క్రాసింగ్ వద్దకు రాగానే రోడ్డు పై నుంచి పక్కనే ఉన్న గుంతల్లోకి పోనిచ్చాడు. డ్రైవర్ బస్సు నడుపుతున్నంత సేపు ప్రయాణికులు భయంతో వణికిపోయారు. డ్రైవర్ ని కాస్త నెమ్మదిగా నడపాల్సిందిగా కండెక్టర్ కి చెప్పారు. అయినా డ్రైవర్ బస్సును అతి వేగంగా నడుపుకుంటూ గుంతలోకి పోనివ్వడంతో అనమానం వచ్చిన కండెక్టర్, ప్రయాణికులు డ్రైవర్ ని నిలదీశారు. అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యారు.

సదరు డ్రైవర్ అసలు ఆర్టీసీ డ్రైవర్ కాదని.. బస్సును చోరీ చేసే యత్నం చేసినట్లు తెలుసుకొని షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు పలుమార్లు జరిగాయి. ఏపిలోని పాలకొండలో ఓ వ్యక్తి మద్యం సేవించి గోకర్ణపల్లిలోని తన ఇంటికి వెళ్లడానికి ఏ వాహనం దొరకపోవడంతో అక్కడే ఉన్న ఆర్టీసీ బస్సును తీసుకు వెళ్లినట్లు పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు. కరోనా సమయంలో కేరళాకు చెందిన దినూప్ అనే 30 ఏళ్ల యువకుడు కొజికోడ్ బస్టాండ్ సమీపంలో పార్క్ చేసిన ఉన్న బస్సును చోరీ చేశాడు. తన భార్యను కలుసుకునేందుకు బస్సు చోరీ చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. తాజాగా సిద్దిపేటలో ప్రయాణికులు ఉన్న సమయంలో బస్సు చోరీకి గురికావడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.