సీఎం కేసీఆర్ ని కలిసి తుదినిర్ణయం ప్రకటిస్తా: పొన్నాల లక్ష్మయ్య

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. నవంబర్ 3 న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉండబోతుందని ఈసీఈ వెల్లడించింది. ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాలకు సన్నద్దమవుతున్నాయి. మరోవైపు టికెట్ విషయలో తీవ్రమైన నిరాశకు గురైన వారు రాజీనామాలు చేస్తున్నారు.. వారిని బుజ్జగించే పనిలో పార్టీ అధినేతలు ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో తనకు తీవ్ర అవమానాలు ఎదురైతున్నాయని.. బీసీలకు సీట్ల కేటాయింపులో చాలా అన్యాయం జరుగుతుందని.. ఈ విషయాన్ని అధిష్టానానికి ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతూ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఇక పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఇంటికి వెళ్లి సాదరంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శానంపూడి సైదిరెడ్డి లు ఉన్నారు.

కేటీఆర్ కలిసిన అనంతరం పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఈరోజు మంత్రి కేటీఆర్ నన్ను కలిశారు. బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. నాలాంటి సీనియర్ నాయకులు బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ని కలిసేందుకు రావాలని కోరారు. రేపు సీఎం కేసీఆర్ ని కలిసిన తర్వాత నా నిర్ణయాన్ని తెలియజేస్తాను అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బ్రస్టుపట్టిపోతుంది.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీనియర్లకు గౌరవం లేకుండా పోతుంది అంటూ రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు.

Show comments