P Venkatesh
ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి సాయం చేయాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రాణం పోతుంటే ఫోటోలు, వీడియోలు తీస్తూ కాలక్షేపం చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి సాయం చేయాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రాణం పోతుంటే ఫోటోలు, వీడియోలు తీస్తూ కాలక్షేపం చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
P Venkatesh
రాను రాను మానవత్వం మంటగలిసి పోతున్నది. ఆపదలో ఉంటే రక్షించాల్సింది పోయి వేడుకల చూస్తున్నారు జనాలు. ప్రాణాలు పోతుంటే పట్టనట్టు ఎవరి దారిన వారు వెళ్తున్నారు. సాటి మనిషికి సాయం చేయాలన్నా సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు. పశు పక్ష్యాదుల్లో ఉండే సాయం చేసే గుణం మనుషుల్లో లేకుండా పోతున్నది. కష్ట సమయంలో అండగా ఉండాల్సింది పోయి భాద్యత మరిచి వ్యవహరిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే సెల్ ఫోన్ లో ఫోటోలు, వీడియోలు తీస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించకుండా టైమ్ పాస్ చేస్తున్నారు.
కనీసం అంబులెన్స్ కు కూడా సమాచారం అందించకుండా ప్రాణాలు పోతుంటే చూస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో ప్రమాద దృశ్యాలను చిత్రీకరించి అప్ లోడ్ చేస్తూ విచక్షణరహితంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తనను బ్రతికించాలని వేడుకున్నాడు. కాళ్లు మొక్కుతా బతికించండంటే సాయం మరిచి ఫోటోల కోసం పోటీపడ్డారు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ ఘటన కీసరలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరా ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన వి.ఏలేందర్ (35) అనే వ్యక్తి కీసర సమీప రాంపల్లి చౌరస్తాలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. కీసరలోనే అతడు ఓ సొంతిల్లు నిర్మిస్తున్నాడు.
ఈ క్రమంలో ఇంటి పనులను పర్యవేక్షించేందుకు బుధవారం (నవంబర్ 20) సాయంత్రం ఇంటి నుంచి స్కూటీపై బయల్దేరాడు. అలా వస్తున్న క్రమంలో కీసర ఔటర్ రింగు రోడ్డు వద్దకు చేరుకోగానే.. వెనుక నుంచి వచ్చిన ఓ లారీ ఏలేందర్ స్కూటీని ఢీకొట్టింది. దీంతో ఎలేందర్ రోడ్డుపై పడిపోగా.. లారీ చక్రాలు అతడి కాళ్ల మీదినుంచి వెళ్లాయి. ఈ ప్రమాదంలో ఏలేందర్ తీవ్ర గాయపడ్డాడు. అతడి రెండు కాళ్లు నుజ్జునుజ్జయి తీవ్ర రక్తస్రావం జరిగింది. నొప్పితో విలవిల్లాడిపోయిన ఏలేందర్.. తనను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లమని స్థానికులను వేడుకున్నాడు. కానీ, అక్కడ గుమికూడిన జనం ఒక్కరు కూడా సాయం అందించేందుకు ముందుకు రాలేదు. అదీగాక గాయపడిన వ్యక్తి ఫోటోలు, వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందారు.
అంబులెన్స్ కు ఫోన్ చేయకుండా కాలక్షేపం చేశారు. ఆ తర్వాత చాలా సమయం గడిచిన తర్వాత అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుంది. వెంటనే అతడిని ఈసీఐఎల్ చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్ర రక్తస్త్రావం కావటంతో అప్పటికే ఏలేందర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గోల్డెన్ అవర్ లో బాధితుడిని హాస్పిటల్ కు తీసుకొస్తే ప్రాణాలు దక్కే అవకాశం ఉండేదని డాక్టర్లు తెలిపారు. సాటి మనుషుల నిర్లక్ష్యం కారణంగా ఏలేందర్ ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇది తెలిసిన వారు మానవత్వం చచ్చిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాళ్లు మొక్కుతా బతికించమని వేడుకున్నా సాయం మరిచి ఫోటోల కోసం పోటీపడ్డ జనాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.