iDreamPost
android-app
ios-app

పెద్దపల్లి: తండ్రిని పట్టించుకోని కొడుకు.. కలెక్టర్ చేసిన పనితో రోగం కుదిరింది

  • Published Sep 04, 2024 | 11:29 AM Updated Updated Sep 04, 2024 | 11:29 AM

Peddapalli Collector: ఆస్తి తీసుకుని.. తండ్రిని పట్టించుకోని ఓ వ్యక్తికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఊహించని షాక్ ఇచ్చారు. ఆ వివరాలు..

Peddapalli Collector: ఆస్తి తీసుకుని.. తండ్రిని పట్టించుకోని ఓ వ్యక్తికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఊహించని షాక్ ఇచ్చారు. ఆ వివరాలు..

  • Published Sep 04, 2024 | 11:29 AMUpdated Sep 04, 2024 | 11:29 AM
పెద్దపల్లి: తండ్రిని పట్టించుకోని కొడుకు.. కలెక్టర్ చేసిన పనితో రోగం కుదిరింది

బిడ్డలే లోకంగా బతుకుతారు తల్లిదండ్రులు. వారికి మంచి భవిష్యత్తును అందించడం కోసం అహర్నిశలు శ్రమిస్తారు. పిల్లల సంతోషమే తల్లిదండ్రులకు ముఖ్యం. అందుకోసం వారు ఎంత కష్టాన్ని అయిన ఓర్చుకుంటారు.. ఎంతటి బాధనైనా దిగ మింగుతారు. బిడ్డల కోసం జీవితాన్నే త్యాగం చేసే తల్లిదండ్రులు.. కోరుకునేది ఏంటంటే.. ముసలితనంలో తమకు కాస్త ఆసరా, బుక్కెడు బువ్వ, కూసింత ఆదరణ. కానీ నేటి కాలంలో బిడ్డల దగ్గర నుంచి ఆప్యాయతను కోరడం కూడా అత్యాశే అవుతుంది. తమ కోసం జీవితాలను పణంగా పెట్టిన తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టడానికి మనసు రాని బిడ్డలు మన సమాజంలో కోకొల్లలు ఉన్నారు. ఆస్తులు లాక్కుని.. ఆ తర్వాత తల్లిదండ్రులను రోడ్డు పాలు చేస్తున్నారు. అదుగో అలాంటి ఓ కొడుక్కి.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష దిమ్మతిరిగేలా బుద్ది చెప్పారు. ఆ వివరాలు..

ఆస్తి రాయించుకుని.. ఆ తర్వాత తండ్రిని పట్టించుకోని కసాయి కొడుకు తిక్క కుదిర్చారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష. ఆస్తిని తిరిగి తండ్రి పేరు మీదకు మార్పించి.. ఊహించని షాక్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పైడిచింతలపల్లి గ్రామానికి చెందిన గడ్డం బాపురెడ్డికి గడ్డం స్వామిరెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. కొడుకు జీవితంలో సెటిల్ అయ్యే విధంగా తీర్చి దిద్దాడు బాపురెడ్డి. ఇక వయసు మీద పడటంతో.. కుటుంబ వ్యవహారాలను కూడా కొడుక్కి అప్పగించాడు.

ఆస్తి మొత్తం తీసుకుని.. తండ్రిని అనాథలా వదిలేసి

దీనిలో భాగంగా వివిధ సర్వే నంబర్లలోని తనకున్న 6 ఎకరాల 5 గుంటల భూమిని కొడుకు స్వామిరెడ్డి పేరు మీద గిఫ్ట్ డీడ్ చేశా బాపురెడ్డి. తన మీద నమ్మకంతో ఉన్నదంతా తన పేరు మీద రాసిన తండ్రిని బాగా చూసుకోవాల్సింది పోయి.. ఆయనను రోడ్డు మీద వదిలేశాడు స్వామి రెడ్డి. ఉన్నదంతా కొడుకుకే రాసిచ్చేయటంతో.. చేతిలో రూపాయి లేక.. తినడానికి కూడా తిండి లేక ఎంతో ఇబ్బంది పడ్డాడు బాపురెడ్డి. గత్యంతరం లేక.. కొడుకు తన బాగోగులు చూసుకోవట్లేదని పెద్దపల్లి ఆర్డీవోకు ఫిర్యాదు చేశాడు.

దీంతో ఆ తండ్రి ఇచ్చిన విచారణ చేపట్టిన ఆర్డీవో.. స్వామిరెడ్డికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో విసిగిపోయిన బాపురెడ్డి.. గతంలో తన కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తును అప్పీలుగా స్వీకరించి ఇరు వర్గాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇద్దరిని పిలిచి కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరిపారు. ఆర్డీవో ఉత్తర్వుల అమల్లో స్వామిరెడ్డి నిర్లక్ష్యం వహించినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష నిర్ధారించారు.

బుద్ధి చెప్పిన కలెక్టర్..

దీంతో.. వయోవృద్ధుల సంక్షేమ చట్టం-2007 ప్రకారం గడ్డం బాపురెడ్డి కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసి తిరిగి తండ్రి పేరిట బదిలీ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష నిర్ణయించారు. అలాగే తండ్రి పోషణకు ప్రతి నెలా రూ. 10 వేలు ఆయన బ్యాంకు ఖాతాలో జమ చేయాలని కుమారుడు స్వామిరెడ్డితో పాటు కుమార్తె సింగిరెడ్డి లతను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న స్థానికులు బాగైంది.. తిక్క కుదిరింది… ఆస్తులు తీసుకుని.. తల్లిదండ్రులను వదిలేసే సంతానానికి ఇది చెంపపెట్టు అంటున్నారు.