రాజకీయ నేతలకే ఆదర్శంగా నిలుస్తున్న దంపతులు.. వారి నిర్ణయానికి హ్యాట్సాఫ్‌

పెళ్లి రోజు సందర్భంగా ఓ యువ జంట తీసుకున్న నిర్ణయం సామాన్యులకే కాక.. రాజకీయ నేతలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..

పెళ్లి రోజు సందర్భంగా ఓ యువ జంట తీసుకున్న నిర్ణయం సామాన్యులకే కాక.. రాజకీయ నేతలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..

ఆకాశంలో సగం అంటారు.. అంతరిక్షంలోకి కూడా దూసుకెళ్తుంది అంటారు.. కానీ ఆమె పుట్టుకను మాత్రం నేటికి కూడా చాలా మంది తల్లిదండ్రులు అంగీకరించలేకపోతున్నారు. ఆడపిల్ల అంటే అదనపు భారం అని భావించే తల్లిదండ్రులు ఈ కాలంలో కూడా ఉన్నారంటే మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆడపిల్లల జననాలతో పాటు వారిని అన్ని రంగాల్లో ప్రోత్సాహించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు, ప్రోత్సాహకాలు ఇచ్చినా.. నేటికి కూడా ఆడపిల్ల అంటే వద్దనుకునే వారు ఉన్నారు. ఆడపిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సాహించడం కాదు.. వారి పుట్టుకను స్వాగతించేలా చేయడం కోసం ఓ జంట తీసుకున్న నిర్ణయం రాజకీయ నాయకులకు సైతం ఆదర్శంగా నిలిచింది. ఇంతకు వారు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే..

ఆడపిల్ల పుడితే.. వారి పేరిట కొంత సొమ్ము డిపాజిట్‌ చేయడానికి ముందుకు వచ్చారు ఓ దంపతులు. వారి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా తాడ్వాయి మండలం, ఎండ్రియల్‌ గ్రామానికి చెందిన ఓ యువ జంట ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామానికి చెందిన రెడ్డిగారి శ్రావణలక్ష్మి, తిరుపతిరెడ్డిలు తమ 10 వ పెళ్లి రోజు సందర్భంగా ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు ఆ జోడి. తమ గ్రామంలో జన్మించిన ఆడపిల్ల పేరు మీద 2 వేల రూపాయల నగదును డిపాజిట్‌ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

2024, జనవరి 1 నుంచి తమ గ్రామంలో జన్మించిన ప్రతి ఆడపిల్లకు తమ వంతు సాయంగా.. పోస్టల్‌ శాఖలో ఖాతా తెరిచి ఒక్కొక్కరి పేరు మీద రూ. 2 వేల నగదును డిపాజిట్‌ చేయనున్నట్లు వెల్లడించారు. వారి నిర్ణయాన్ని గ్రామస్తులు అభినందిస్తున్నారు. వారి నిర్ణయం సామాన్యులకే కాక రాజకీయ నేతలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసిస్తున్నారు.

చాలా మంది బర్త్‌ డే, పెళ్లి రోజు వంటి వాటి కోసం నానా హంగామా చేస్తుంటారు. ఆడంబరాలకు పోయి భారీగా ఖర్చు చేస్తుంటారు. లక్షలు పోసి పార్టీలు, గిఫ్ట్స్‌ ఇవ్వడం చేస్తారు. కానీ మరుసటి రోజే దాన్ని మర్చిపోతారు. దాని బదులు ఇలా సమాజానికి ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటే.. ఎందరికో జీవితాన్ని ఇచ్చిన వారు అవుతారు. ఈ నిర్ణయం వల్ల ఆడపిల్లలకు మేలు చేసిన వారవుతారు.. మీకు కూడా సంతృప్తి దక్కుతుంది అని కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. సర్కార్‌ దవాఖానల్లో డెలివరీలు, ఆడపిల్ల జననాలు పెంచడం కోసం కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీని కింద ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేయించుకుంటే 12 వేల రూపాయలు ఇస్తారు. అదే ఆడపిల్ల పుడితే మరో వెయ్యి ఎక్స్‌ట్రా అనగా 13 వేలు ఇస్తారు. ఆడపిల్లల జననాలను ప్రోత్సాహించడం కోసం ప్రభుత్వాలు ఇలా ఎన్నో రకాల పథకాలను తీసుకొస్తున్నాయి.

Show comments