Free Bus Journey: ఫ్రీ జర్నీ అయినా సరే ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు.. స్పందించిన సజ్జనార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది. కానీ ఓ కండక్టర్ మాత్రం.. చార్జీ వసూలు చేశాడు. అది కాస్త వైరల్ కావడంతో.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దీనిపై స్పందించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది. కానీ ఓ కండక్టర్ మాత్రం.. చార్జీ వసూలు చేశాడు. అది కాస్త వైరల్ కావడంతో.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దీనిపై స్పందించారు.

తెలంగాణలో తమను గెలిపిస్తే.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా ఆ హామీని నెరవేర్చింది. డిసెంబర్ 9 నుంచి అనగా శనివారం మధ్యాహ్నం నుంచి మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ జర్నీ అందించే మహాలక్ష్మి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతానికి ఈ పథకం.. తెలంగాణలో ఉన్న మహిళలందరికి వర్తిస్తుంది. త్వరలోనే నియమ నిబంధనలు అమల్లోకి వస్తాయి అంటున్నారు. ఇందులో భాగంగా బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో, సిటీలో అయితే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందుబాటులోకి రాగా.. ఓ బస్సులో మాత్రం కండక్టర్ మహిళల దగ్గర ఛార్జీ వసూలు చేశాడు. ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక కూడా టికెట్ ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించినా సదరు కండెక్టర్ వినలేదు. దాంతో దీని గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ కావడంతో.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దీనిపై స్పందించారు. సదరు కండక్టర్ మీద చర్యలకు ఆదేశించారు. ఈ సంఘటన నిజమామాబాద్ లో చోటు చేసుకుంది.

నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు కండక్టర్ టికెట్‌ కొట్టి.. ఛార్జీలు వసూలు చేశాడు. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తీసుకొచ్చిందని వాదించినా సరే వినకుండా.. మహిళా ప్రయాణికుల నుంచి 90 రూపాయల ఛార్జీ వసూలు చేశాడు సదరు కండెక్టర్. మహిళలు ఎంత వాదించినా వారి మాట వినలేదు. ఇది గమనించిన ఓ వ్యక్తి కండక్టర్ నిర్వాకాన్ని వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ గా మారడమే కాక.. తెలంగాణ ఆర్టీసీ ఎండీ దృష్టికి చేరింది. వెంటనే ఆయన దీనిపై స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అలాగే కండక్టర్‌ను డిపో స్పేర్‌లో ఉంచామని.. విచారణ అనంతరం అతడిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అయితే.. ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు ఒక రోజు ముందుగానే ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌‌ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిపోలకు మార్గదర్శకాలు కూడా పంపించారు. మహాలక్ష్మి పథకం కింద వయసుతో సంబంధం లేకుండా మహిళలంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం చేయవచ్చని.. ఇందుకోసం కేవలం వాళ్ల దగ్గర ఏదైనా ఐడీ కార్డు ఉంటే చాలని తెలిపారు. అయితే.. పథకం ప్రారంభమైన మొదటి వారం రోజులు ఐడీ కార్డు కూడా చూపించాల్సిన పని కూడా లేదని తెలిపారు. అయినా సరే కండక్టర్ ఇలా చేయటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

Show comments