Dharani
Dharani
కొన్నేళ్ల క్రితం ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు, అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవి జనాలు అంత త్వరగా మర్చిపోలేరు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ సర్కార్ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించే దిశగా అనేక చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ చర్యలతో ప్రస్తుతం రాష్ట్రంలోని గవర్నమెంటు బడులు.. ప్రైవేటు స్కూల్స్‌కు ధీటుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ క్రమంలో ఓ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీన్ని చూసిన వారు.. ఇది ప్రభుత్వం నిర్వహించే అంగన్వాడీ కేంద్రమా.. లేక కార్పొరేట్ స్కూలా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ రేంజ్‌లో ఇక్కడ అభివృద్ధి చేసి, సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరి ఇంతకు ఈ అంగన్వాడీ కేంద్రం ఎక్కడ ఉంది.. అక్కడ ఇలాంటి మార్పులకు కారణం ఏంటంటే..
మరి కార్పొరేట్ స్కూల్స్‌ని తలదన్నేలా తీర్చిదిద్దిన ఈ అంగన్వాడీ కేంద్ర.. నారాయణపేటలో ఉంది. జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఆలోచనతో 2 నెలల కిందట ఈ మోడ్రన్ అంగన్వాడీ కేంద్ర ఏర్పాటైంది. పట్టణాల్లో ఒక్కో అంగన్‌వాడీ కేంద్రంలో 20 నుంచి 30 మంది చిన్నారులుంటారు. అంతమందిని ఒక్క టీచరే చూసుకోవడం క ష్టం. అందుకే నారాయణపేట పట్టణంలోని 6 కేంద్రాలను ఒక్కచోటకు చేర్చి 100మంది విద్యార్ధులతో ఆధునిక అంగన్వాడీని ఏర్పాటు చేశారు కలెక్టర్ శ్రీహర్ష. ఆ కేంద్రాల్లోని టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్యపై ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.
6 కేంద్రాల పిల్లలు ఒకేచోటకు రావాలంటే తల్లిదండ్రులకు దూరభారం అవుతోంది. ఇందుకు పరిష్కారంగా త్వరలోనే బస్సు సౌకర్యాన్ని సైతం ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రయత్నం విజయవంతమైతే.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 2- 4వేల జనాభా ఉన్న గ్రామాల్లో ఇలాంటి ఆధునిక అంగన్వాడీ కేంద్రాలనే ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
ప్రతిరోజు ఉదయం ఈ అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పిల్లలకు ఆయాలు, అంగన్‌వాడీ టీచర్లు సాదరంగా, చిరునవ్వుతో స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత పిల్లలు తమకు నచ్చిన హావభావాలతో టీచర్లను పలకరిస్తారు. వయసు, విద్యాసామర్థ్యాలను బట్టి పిల్లలను.. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ .. ఇలా 3తరగతులుగా విభజిస్తారు. విద్యార్ధులకు చదువంటే ఆసక్తి కలిగించేలా.. అంగన్వాడీ కేంద్రంలో అందమైన రంగురంగుల బొమ్మలను ఏర్పాటు చేసి.. కేంద్రాన్నిఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇక్కడ చిన్నారులకు ఆటపాటలతో చదువు నేర్పేందుకు అవసరమైన అన్ని రకాల బొమ్మలు, ఆటవస్తువులు, బోధన పరికరాలు, పుస్తకాల్ని ఉచితంగా సమకూర్చారు.
పిల్లల శారీరక ఎదుగుదల కోసం అల్పాహరం, మధ్యాహ్న భోజనంగా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. భోజనానంతరం గంటపాటు పిల్లలు అక్కడే నిద్రపోతారు. పిల్లల కండరాల ఎదుగుదల కోసం ప్రత్యేక ఎక్సర్‌సైజ్‌లు చేయిస్తారు. మానసిక, శారీరక ఉల్లాసం కోసం చిన్నారుల చేత రకరకాల ఆటలాడిస్తారు. క్రమశిక్షణ, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. వరుసలో నిలబడటం, ఒకరి తర్వాత ఒకరు వెళ్లడం, చెప్పులు వరుసలో పెట్టడం, పెద్దలను గౌరవించడం వంటి మంచి అలవాట్లను పిల్లలు అలవర్చుకునేలా చర్యలు తీసుకుంటారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పిల్లలు ఈ కేంద్రంలో ఉత్సాహంగా గడుపుతారు.
ఈ మోడ్రన్ అంగన్వాడీ కేంద్రాన్ని చూసిన తర్వాత చాలా మంది తల్లిదండ్రులు.. వేలకు వేలు ఖర్చు చేసి పిల్లల్ని ప్రైవేటు ప్లే స్కూళ్లకు పంపే బదులు.. ఇక్కడకు పంపడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎంత డబ్బుపోసినా ప్రైవేటులో పిల్లలకు చదువు, క్రమశిక్షణ, మంచిఅలవాట్లు అబ్బుతాయన్న హామీలేదని, ఆధునిక అంగన్వాడీలో చేర్చిన తర్వాత పిల్లల్లో మంచి మార్పును గమనిస్తున్నామంటున్నారు. అనువైన చోట జిల్లా వ్యాప్తంగా ఇలాంటి అంగన్వాడీలే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.