Dharani
ములుగు జిల్లా కలెక్టర్ గొప్ప మనసు చాటుకున్నారు. గిరిజనుల కోసం ఆయన చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పైగా రాష్ట్రంలోని ఇదే తొలిసారి అంటున్నారు. ఆ వివరాలు..
ములుగు జిల్లా కలెక్టర్ గొప్ప మనసు చాటుకున్నారు. గిరిజనుల కోసం ఆయన చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పైగా రాష్ట్రంలోని ఇదే తొలిసారి అంటున్నారు. ఆ వివరాలు..
Dharani
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లకు పైగా గడుస్తున్నా.. గిరిజనుల జీవితాలు మాత్రం మారడం లేదు. ఎక్కడో గుట్టల్లో, అటవీ ప్రాంతాల్లో.. కనీస మౌలిక సౌకర్యాలకు దూరంగా.. ఎన్నో సమస్యల మధ్య జీవితాలను సాగదీస్తుంటారు. ఇక అనారోగ్యానికి గురైతే వారి కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వైద్య సౌకర్యానికి చాలా దూరంగా ఉంటాయి వారి జీవితాలు. తీవ్ర అనారోగ్యానికి గురైనా, గర్భిణీలను ప్రసవం కోసం తీసుకెళ్లాలన్నా సరే.. సాహసం చేయాల్సిందే. బాధితులను డోలీలు, మంచాలు, బెడ్‌షీట్‌లలో మోసుకుంటూ ఆస్పత్రులకు తరలించాల్సిన పరిస్థితి.. అది కూడా కిలోమీటర్ల దూరం నడుస్తూ. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. గిరిజనులు జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ములుగు జిల్లా కలెక్టర్.. గిరిజనుల కోసం చేసిన ఓ ప్రయత్నం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆ వివరాలు..
ఈ నేపథ్యంలో గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ములుగు జిల్లా కలెక్టర్ వినూత్నంగా ఆలోచించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏజెన్సీ ప్రాంతంలో కంటెయినర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఆయన చేసిన ప్రయత్నం ఎందరికో ఆదర్శంగా నిలవగా.. దీనిపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక రాష్ట్రంలోని ఈ తొలి కంటెయినర్ ఆస్పత్రిని ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపూర్ గ్రామంలో ఏర్పాటు చేశారు.
ఇది జాతీయ రహదారికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ పోచాపూర్‌తో పాటు నర్సాపూర్, బందాల, అల్లిగూడెం, బొల్లెపల్లి అనే గ్రామాలుంటాయి. అయితే ఇక్కడ నివసించే గిరజనులు వైద్యం చేయించుకోవాలంటే.. గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ గ్రామాల ప్రజలు ప్రతి సోమవారం పస్రాలో జరిగే వారాంతపు సంతకొచ్చి సరకులతో పాటు ఎవైనా అనారోగ్య సమస్యలుంటే.. పస్రా ప్రైమరీ హెల్త్ సెంటర్, లేదంటే ప్రైవేటు డాక్టర్లను ఆశ్రయిస్తుంటారు.
ఎంతటి అత్యవసర వైద్యమైనా సరే సంత జరిగే సోమవారం వరకు ఆగాల్సిందే. ఇలాంటి సమయాల్లో అత్యవసర వైద్యం అందక చాలా మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర వినూత్నంగా ఆలోచించారు. అక్కడ వర్షకాలం సీజన్‌లో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని భావించారు.
ఈ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించడం కోసం ఓ కంటెయిన్‌లో ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. దీనిలో భాగంగానే రూ. 7 లక్షల వ్యయంతో నాలుగు పడకలతో ఈ కంటెయినర్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో కంటెయినర్ ఆసుపత్రికి తీసుకొచ్చి పోచాపూర్‌లో సెటప్ చేశారు. అక్కడ వైద్యులను అందుబాటులో ఉంచారు. ఈ వారంలో హాస్పిటల్ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ నిర్ణయంపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి అధికారి ఇలా ప్రజల సమస్య పరిష్కారం కోసం పని చేస్తే బాగుటుంది అంటున్నారు.