Dharani
రైతు రుణమాఫికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..
రైతు రుణమాఫికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో ఎన్నికల వేళ ఆరు గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే వాటిని నెరవేర్చే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే ఉచిత కరెంట్, ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ, మహిళలకు 500లకు గ్యాస్ సిలిండర్, ఆరోగ్య శ్రీ మొత్తం పెంపు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఇచ్చిన కీలక హామీల్లో రైతు రుణమాఫీ ఒకటి. తాము అధికారంలోకి వస్తే ఒక్కొక్క రైతుకు రూ.2 లక్షల మేర రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై స్పందించిన వ్యవసాయం శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా కీలక ప్రకటన చేశారు.
కాంగ్రెస్ సర్కార్ వ్యవసాయ అభివృద్ధికి కట్టుబడి ఉందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారినప్పటికీ.. ఎన్ని ఇబ్బందులున్నా.. సరే తమ ప్రభుత్వం అన్నదాతల శ్రేయస్సుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా.. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు.
మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి ఆర్‌బీఐ, బ్యాంకులతో కలిసి విధివిధానాల రూపకల్పన చేస్తున్నామని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. ఈ రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్ లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికే రైతు భరోసా కోసం ప్రత్యేక విధివిధానాలు రూపొందిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. రైతు రుణమాఫీకి కూడా గైడ్ లైన్స్ సిద్ధం చేస్తోంది.
మరోవైపు.. అధికారంలో ఉన్నపుడు ఏ రోజూ రైతుల గురించి పట్టించుకోకుండా.. పంట పొలాల వైపు కనీసం కన్నెత్తి చూడని బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు రైతులపై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారంటూ తుమ్మల విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఓఆర్‌ఆర్‌ను తాకట్టు పెట్టి కేవలం సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు అన్యాయం జరిగిపోయిందంటూ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థుతులను కూడా రాజకీయం చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ అసహనం వ్యక్తం చేశారు.