మేడారంలో షాకింగ్ రేట్స్.. ఒక కోడి రూ.400, మేక ఏకంగా రూ.10 వేలు!

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దీంతో వ్యాపారులు ధరల మోత మోగిస్తున్నారు.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దీంతో వ్యాపారులు ధరల మోత మోగిస్తున్నారు.

తెలంగాణ కుంభమేళా.. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధికెక్కిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభమైంది. బుధవారం (ఫిబ్రవరి 21) నాడు పగిడిద్ద రాజు, జంపన్న, సారలమ్మను గద్దెల మీదకు తీసుకొచ్చి ప్రతిష్టించారు. దీంతో జాతర స్టార్ట్ అయింది. మేడారం జాతరలో అత్యంత ప్రధాన ఘట్టం ఇవాళ జరగనుంది. గురువారం (ఫిబ్రవరి 22) నాడు చిలకల గుట్ట నుంచి సమక్కను గద్దెల మీదకు తీసుకురానున్నారు. మేడారానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. గద్దెల మీద కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకునేందుకు అందరూ మేడారం జాతరకు పోటెత్తుతున్నారు. అయితే ఇదే అదనుగా అక్కడి వ్యాపారులు ధరల మోత మోగిస్తున్నారు. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ రేట్లను పెంచుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా కోడి, మేకల ధరలు మండిపోతున్నాయి.

మేడారానికి భక్తుల రాక పెరుగుతున్న కొద్దీ ధరలకు మరింత రెక్కలు వస్తున్నాయి. జాతరలో కోడి లేదా యాటల్ని కొనడం తప్పనిసరి. అయితే రేట్లు మాత్రం మండిపోతున్నాయి. మేడారం జాతరలో ఒక్కో కోడి కిలో రూ.400కు.. ఒక్కో మేక, గొర్రెల్ని రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. దీంతో భక్తులు ఆ ధరలు చూసి భయపడిపోతున్నారు. అమ్మవార్ల మొక్కులు తీర్చుకుందామంటే ఈ రేట్లు ఏంటని వణికిపోతున్నారు. కోడి, మేకల ధరలే కాదు.. ఇంకా చాలా వస్తువుల రేట్లు భక్తులను భయపెడుతున్నాయి. బయటి మార్కెట్​తో పోలిస్తే అక్కడ ధరలు రెండు నుంచి మూడు రెట్లు అధికంగా ఉన్నాయి. మామూలుగా బయట ఒక టెంకాయ రూ.20 నుంచి రూ.30 ఉంటుంది. కానీ మేడారంలో ఒక్కో కొబ్బరికాయను రూ.100కు అమ్ముతున్నారు. ఇంక మద్యం ధరలైతే చెప్పనక్కర్లేదు.

మేడారం జాతరలో మందు తాగాలంటే మినిమం రూ.500 నోటు తీయాల్సిందే. ఇక, అమ్మవారికి ఎంతో ఇష్టమైన బంగారాన్ని (బెల్లం) కూడా రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. బయట మార్కెట్​లో కేజీ బెల్లం రూ.40 నుంచి రూ.50 వరకు ఉంది. కానీ మేడారంలో మాత్రం కిలో బెల్లం రూ.100కు పైనే అమ్ముతున్నారు. ఏ వస్తువు కొనాలన్నా, తినాలన్నా, తాగాలన్నా జాతరలో భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. జేబులకు భారీగా చిల్లు పడుతుండటంతో భక్తులు సీరియస్ అవుతున్నారు. మార్కెట్ ధరల కంటే కాస్త ఎక్కువ లాభానికి అమ్మడంలో తప్పు లేదని.. కానీ ఇలా రెండు, మూడు రెట్లు అధిక ధరలకు విక్రయించడం కరెక్ట్ కాదని వాపోతున్నారు. ఇది కరెక్ట్ కాదని.. వస్తువులను అందుబాటులో ధరల్లో అమ్మాలని డిమాండ్ చేస్తున్నారు. మరి.. మేడారం జాతరలో వస్తువుల ధరలకు రెక్కలు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పెళ్లి విందులో మహిళలకు మద్యం.. వీడియో వైరల్

Show comments