iDreamPost
android-app
ios-app

తండ్రి మృతి చెందిన కొన్ని గంటలకే కుమారుడు జననం! కంటతడి పెట్టిస్తున్న ఘటన!

తండ్రి మృతి చెందిన కొన్ని గంటలకే కుమారుడు జననం! కంటతడి పెట్టిస్తున్న ఘటన!

 అమ్మానాన్న అని పిలిపించుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ, ఆ అదృష్టం కొందరిని వరిచేందుకు చాలా ఏళ్లు పడుతుంది. ఇంకా కొందరికి అయితే జీవితాంతం అది ఒక కలగానే మిగిలిపోతుంది. ఇంకొందరి అదృష్టం బాగుండి.. కొన్నేళ్ల తర్వాత అయినా వారి ఇంటికి ఒక చిన్న పాపాయి వస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఒక కుటుంబం గురించే. కానీ, ఈ కుటుంబానకి అదృష్టం, దురదృష్టం రెండూ ఒకేసారి తలుపు తట్టాయి. 16 ఏళ్ల తర్వాత బిడ్డ పుట్టబోతోందని ఆనందంగా ఉంటే.. అదే సమయంలో ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఖఃలో మునిగిపోయింది.

సంతానం కలిగితే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. అదే వివాహం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఆ ఇల్లాలి కడుపు పండితే.. అది వాళ్లకు దేవుడిచ్చిన్న వరం అనుకుంటారు. కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూ ఎన్నో సంబరాలు జరుపుకుంటారు. వారి కలలు, కోరికలు అన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చేస్తాయి. బిడ్డను అల్లారుముద్దుగా పెంచాలి అని తల్లి.. కొడుకుని భుజాలపై కూర్చోపెట్టుకొని లోకం చుపించాలని తండ్రి ఆశ పడతాడు. కానీ.. ఈ తండ్రికి ఆ అదృష్టం లేదు. కన్న కొడుకుని కళ్లారా చూసుకోకుండానే.. కన్నుమూశాడు.

ఈ విషాద ఘటన వనపర్తి జిల్లా శేర్ పల్లిలో చోటుచేసుకుంది. రాజశేఖర్- సర్పంచ్ సునీత దంపతులకు 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు పిల్లలంటే ప్రాణం. కానీ, వారికి మాత్రం పెళ్లైన ఇన్నాళ్ల వరకు పిల్లలు కలగలేదు. బీఆర్ఎస్ లీడర్ రాజశేఖర్- సునీత ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. నాలుగేళ్ల క్రితమే సునీతను సర్పంచ్ గా గెలిపించు కున్నాడు. ఆర్థికంగా, కుటుంబ పరంగా వారి జీవితం సాఫీగా సాగుతున్నప్పటికీ.. పిల్లలు లేరనే లోటు మాత్రం అలాగే ఉండిపోయింది.

పెళ్లైన 16 ఏళ్ళకి సునీత గర్భం దాల్చడంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కోటి ఆశలతో బిడ్డ కోసం వేచి చేస్తూ ఉన్నారు. అయితే వారి జీవితాలు ఊహించని మలుపు తిరిగాయి. రాజశేఖర్ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్ కు తీసుకెళ్లారు. సునీత కు నెలలు నిండటంతో ఆమె ఇంటి వద్దే ఉండిపోయింది. డెలివరీ డేట్ దగ్గర పడటంతో బిడ్డను ఎత్తుకొని ఎంతో సంతోషంగా తన భర్తకు స్వాగతం పలకాలని కలలు కనింది. తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలచినట్లు కిడ్నీలు చెడిపోయి.. మంగళవారం రాత్రి 10 గంటలకు రాజశేఖర్ మరణించాడు.

ఈ విషయం సునీతకి తెలిస్తే తట్టుకోలేదని కుటుంబసభ్యులు చెప్పకుండా దాచారు. బుధవారం తెల్లవారుజామున సునీత మగ బిడ్డకు జన్మనిచ్చింది. అదే రోజు హైదరాబాద్ నుంచి రాజశేఖర్ మృతదేహాన్ని ఊరికి తీసుకొచ్చారు. రాజశేఖర్ ప్రాణాలతో లేడనే విషయాన్ని ఆమెకు చెప్పే ధైర్యం చేయలేకపోయారు. ఆమెకు చెప్పకుండానే రాజశేఖర్ కు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. తన భర్త ఇంక లేడనే విషయం తెలియక ఆ పిచ్చితల్లి తన బిడ్డను పొత్తిళ్లలో పెట్టుకుని రాజశేఖర్ రాకకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.