Krishna Kowshik
ప్రేమించుకోవడం, కలిసి తిరగడం వరకు సవ్యంగా సాగిపోతుంది కానీ.. పెళ్లి దగ్గరకొచ్చేసరికి అనేక అడ్డంకులు. ముఖ్యంగా తల్లిదండ్రులు వీరి లవ్ ప్రోపజల్ ను ఓ పట్టాన ఒప్పుకోరు. అంగీకరిస్తే.. అది పెళ్లి పీటలు ఎక్కేంత వరకు చెప్పలేని పరిస్థితి.
ప్రేమించుకోవడం, కలిసి తిరగడం వరకు సవ్యంగా సాగిపోతుంది కానీ.. పెళ్లి దగ్గరకొచ్చేసరికి అనేక అడ్డంకులు. ముఖ్యంగా తల్లిదండ్రులు వీరి లవ్ ప్రోపజల్ ను ఓ పట్టాన ఒప్పుకోరు. అంగీకరిస్తే.. అది పెళ్లి పీటలు ఎక్కేంత వరకు చెప్పలేని పరిస్థితి.
Krishna Kowshik
సమాజం విశాల దృక్పథంతో ముందుకు సాగుతున్నా.. ప్రేమ అనే విషయానికి వచ్చేసరికి ఆస్తి అంతస్తులు, కులమతాలు, ఇతర అడ్డుగోడలు అడ్డంకులుగా మారుతూనే ఉన్నాయి. ఇక ప్రేమించిన వ్యక్తులతో లైఫ్ లేదనుకుంటే.. బ్రతుకే వ్యర్థమనుకుని, వారిలేని జీవితం వద్దనుకుని.. ఆత్మహత్యలకు, హత్యలకు ఒడిగడుతున్నారు. కొన్ని సార్లు తల్లిదండ్రులు ఒప్పుకున్నా, తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందాన వ్యవహరిస్తూ.. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీని వల్ల వీరి ప్రాణాలు ప్రమాదంలో పడటంతో పాటు తల్లిదండ్రులకు వేదనను మిగులుస్తున్నారు. ఇద్దరు ప్రేమికులు.. తమ ప్రేమను కుటుంబ సభ్యుల మధ్య వ్యక్త పరిచారు. వారూ ఒప్పుకున్నారు.
కానీ వీరి తొందర పాటు వల్ల ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఒప్పుకుంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకన్న అనుమానం కలుగుతుంది. అసలు ఏమైందంటే..? ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలానికి చెందిన బెజ్జంకి రాజేష్.. మంగపేట మండలం కమలాపురానికి చెందిన మాదరి శిరీష్ అనే యువతి కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇక ఆ యువతికి ఇంట్లో సంబంధాలు చూడటం మొదలు పెట్టేసరికి.. తమ ప్రేమ విషయాన్ని ఇద్దరి ఇళ్లల్లోనూ చెప్పేశారు. వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు. అయితే అబ్బాయి తండ్రి.. మరో 3 ఏళ్ల తర్వాత పెళ్లి చేస్తామని చెప్పగా.. అందుకు అమ్మాయి తండ్రి అంగీకరించలేదు. శిరీష తండ్రి.. ఆరు నెలల్లో పెళ్లి చేయాలని పట్టుబట్టుకు కూర్చున్నారు.
అయితే ఈ విషయంపై రాజేష్-శిరీష తండ్రి మధ్య వాగ్వాదం మొదలయ్యే సరికి.. వీరు తమ పెళ్లి చేస్తారో చేయోరోనన్న భయంతో మనస్థాపానికి గురై.. మంగపేట మండలం మల్లూరు గుట్ట దగ్గరకు వెళ్లి.. తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ ఏటూరు నాగారంలోని ప్రభుత్వాసుప్రతికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వారిని మెరుగైన వైద్యం నిమిత్తం.. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప్రియుడు కన్నుమూశాడు. శిరీష బుధవారం మధ్యాహ్నం మృతి చెందింది. తల్లిదండ్రులు పెళ్లి చేస్తారన్న నమ్మకం లేని కారణంగా వీరిద్దరూ ఇలా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వీరి మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.