iDreamPost
android-app
ios-app

దిగొచ్చిన L&T.. సొంత ఖర్చుతోనే మేడిగడ్డ రిపేరుకు అంగీకరించిన కంపెనీ

  • Published May 24, 2024 | 9:29 AM Updated Updated May 24, 2024 | 9:29 AM

Medigadda Barrage: మేడిగడ్డ ప్రాజెక్ట్‌ డ్యామేజ్‌ తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టిన కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

Medigadda Barrage: మేడిగడ్డ ప్రాజెక్ట్‌ డ్యామేజ్‌ తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టిన కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

  • Published May 24, 2024 | 9:29 AMUpdated May 24, 2024 | 9:29 AM
దిగొచ్చిన L&T.. సొంత ఖర్చుతోనే మేడిగడ్డ రిపేరుకు అంగీకరించిన కంపెనీ

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఓటమి పాలవ్వడానికి ప్రధాన కారణాలు అనగానే చాలా మంది మేడిగడ్డ ప్రాజెక్ట్‌ అని చెబుతారు. సరిగ్గా ఎన్నికల ముందు.. మేడిగడ్డ ప్రాజెక్ట్‌ కుంగిపోవడం.. అది కూడా ఎన్నికల ముందు బయటపడటం.. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రాజెక్ట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. తెలంగాణ భవిష్యత్తుగా భావించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఓ భాగమైన మేడిగడ్డకు ఇలా డ్యామేజ్‌ జరగడం.. దీని భద్రతపై అనేక అనుమానాలను రాజేసింది. ఎన్నికల ముందే ఈ అంశం బయటపడటం కాం‍గ్రెస్‌ పార్టీకి కలిసి వచ్చింది. జాతీయ స్థాయిలో సైతం ఇది పెను సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో తాజాగా మేడిగడ్డ ప్రాజెక్ట్‌ రిపేరుకు ఎల్‌ అండ్‌ టీ అంగీకరించింది. ఆ వివరాలు..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజీని చక్కదిద్దేందుకు ఎల్‌ అండ్‌ టీ కంపెనీ ముందుకు వచ్చింది. పైగా సొంత ఖర్చుతో ఈ డ్యామేజ్‌ను రిపేర్‌ చేసేందుకు అంగీకరించింది. ఈక్రమంలో ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కంపెనీ తరఫున హాజరైన ప్రతినిధులు అనేక విషయాలపై చర్చించారు. ఇక చివరికి కంపెనీ తన సొంత ఖర్చుతోనే బ్యారేజీకి రిపేర్ పనులు చేసేందుకు అంగీకరించింది.

మేడిగడ్డ డ్యామేజ్‌ రిపేర్‌లో భాగంగా ఏయే పనులు చేయాలనే అంశంపై ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) విడుదల చేసిన తన మధ్యంతర నివేదికలో స్పష్టత ఇచ్చింది. వాటికి అనుగుణంగా ఎల్ అండ్ టీ కంపెనీ ఈ పనులను ప్రారంభించనుంది. ఇక రాబోయే వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని పనులకు ఆటంకం లేకుండా అప్పటివరకు మేడిగడ్డ రిపేర్‌ పనులు చూడాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సూచించారు. యుద్ధ ప్రాతిపదికన పనులను మొదలుపెడితేనే సాధ్యమైనంతం త్వరగా వీటిని పూర్తి చేస్తామని ఎల్‌ అండ్‌ టీ వెల్లడించింది. శుక్రవారం అనగా నేటి నుంచే ఈ పనులు ప్రారంభం కానున్నాయి.

మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు కూడా ఒకే తరహాలో ఉన్నాయని పేర్కొన్న ఎన్డీఎస్ఏ, ఆ రెండింటిలోనూ కొన్ని సాంకేతిక సమస్యలు బయటపడ్డాయని.. తాజాగా వెల్లడించిన మధ్యంతర నివేదికలో వెల్లడించింది. నీటి బుంగలు ఏర్పడడంతో పాటు బ్యారేజీ పిల్లర్ల బేస్‌మెంట్ కింద ఇసుక తొలగిపోయిందని ప్రస్తావించింది. వీటన్నింటి కారణంగా మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయరాదని, వచ్చిన నీటిని వచ్చినట్లే వదిలేయాలని, మొత్తం గేట్లను పూర్తిగా పైకి ఎత్తి ఉంచాలని ఎన్టీఎస్‌ఏ సిఫారసు చేసింది. ఇక తాజాగా ఎల్‌ అండ్‌ టీ ఈ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొంది.