Dharani
పేపర్ బాయ్‌గా జీవితం మొదలు పెట్టిన ఆ వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ నేటికి కూడా ఇందిరమ్మ ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు. ఆ వివరాలు..
పేపర్ బాయ్‌గా జీవితం మొదలు పెట్టిన ఆ వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ నేటికి కూడా ఇందిరమ్మ ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు. ఆ వివరాలు..
Dharani
నేటి కాలంలో సర్పంచ్‌గా గెలిచినా సరే.. ఆ తర్వాత వారి తీరు మారుతుంది. ఖద్దరు బట్టలు ధరించి.. కార్లలో తిరుగుతుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ ఎమ్మెల్యే మాత్రం ఇందుకు భిన్నం. ఆయనను చూస్తే.. ఈకాలంలో కూడా ఇలాంటి వారు ఉంటారా అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అసలు ఆయన ప్రస్థానం చూస్తేనే అబ్బురం అనిపిస్తుంది. పేపర్ బాయ్‌గా మొదలైన ఆయన కెరీర్.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. నేడు ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నారు. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచాడు కదా.. మరి ఇప్పటికైనా ఆయన లైఫ్ స్టైల్ మారిందా అంటే ఏమాత్రం లేదు.. నేటికి కూడా ఇందిరమ్మ ఇంట్లోనే నివాసం ఉంటూ.. నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు సదరు ఎమ్మెల్యే. ఆయన సింప్లిసిటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే.. అంటే..
పేపర్ బాయ్‌గా జీవితం మొదలు పెట్టి.. ఎమ్మెల్యేగా గెలిచినా సరే.. నేటికి కూడా ఇందిరమ్మ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత.. పేపర్‌బాయ్‌గా పని చేసినట్లు చెప్పుకొచ్చారు బొజ్జు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల.. నేడు తాను ఎమ్మెల్యేగా విజయం సాధించానని చెప్పుకొచ్చారు. మంగళవారం (జనవరి 16) హైదరాబాద్ సుందరయ్య కళానిలయంలో జరిగిన రాష్ట్ర ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రథమ మహాసభకు ఎమ్మెల్యే బొజ్జు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బొజ్జు మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2006లో డిగ్రీ పూర్తయిన తర్వాత తన తాత గేదెను అమ్మి తనకు సైకిల్ కొనిచ్చారని గుర్తు చేసుకున్నారు బొజ్జు. చేతిలో సైకిల్ ఉండటంతో తాను పేపర్ బాయ్‌గా మారాను అని చెప్పుకొచ్చారు. ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ స్టాండు ప్రాంతంలో పేపర్ బాయ్‌గా పని చేశానని తెలిపారు. తర్వాత ఓ పత్రికలో జర్నలిస్టుగా కూడా పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తాను ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లోనే జీవనం సాగిస్తున్నానని వెల్లడించి.. అందరిని ఆశ్చర్యపరిచారు. న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్ల న్యాయమైన డిమాండ్లను సీఎం రేవంత్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు ఎమ్మెల్యే బొజ్జు.
ఎమ్మెల్యేగా గెలిచిన బొజ్జు స్వస్థలం..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం కల్లూర్‌గూడ. ఆ ఊరికి చెందిన నిరుపేద ఆదివాసీ దంపతులు వెడ్మ భీంరావు, గిరిజాబాయిల కుమారుడు వెడ్మ బొజ్జు. పీజీ వరకు చదివిన బొజ్జు తొలుత ఆదివాసీ విద్యార్థి సంఘంలో.. తర్వాత ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ)లో సలహాదారుడిగా పని చేశారు. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 తెలంగాణ ఎన్నికల వేళ ఖానాపూర్ టికెట్ దక్కించుకున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, బీఆర్ఎస్ నుంచి ఎన్నారై, కేటీఆర్ ఫ్రెండ్ భూక్యా జాన్సన్‌లతో పోటీపడి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేగా గెలిచారు.