iDreamPost
android-app
ios-app

సత్తా చాటిన అన్నాచెల్లెళ్లు.. ఇద్దరికి ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు

  • Published Jan 29, 2024 | 12:49 PM Updated Updated Jan 29, 2024 | 12:49 PM

Staff Nurse Recruitment: ఇంట్లో ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తేనే చాలా గ్రేట్‌ అనుకుంటాము.. అలాంటిది తోబుట్టువులిద్దరూ ఒకేసారి సర్కార్‌ కొలువు సాధిస్తే.. ఆ వివరాలు..

Staff Nurse Recruitment: ఇంట్లో ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తేనే చాలా గ్రేట్‌ అనుకుంటాము.. అలాంటిది తోబుట్టువులిద్దరూ ఒకేసారి సర్కార్‌ కొలువు సాధిస్తే.. ఆ వివరాలు..

  • Published Jan 29, 2024 | 12:49 PMUpdated Jan 29, 2024 | 12:49 PM
సత్తా చాటిన అన్నాచెల్లెళ్లు.. ఇద్దరికి ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు

చాలా మంది యువత ప్రభుత్వ ఉద్యోగమే తమ జీవిత ధ్యేయం అన్నట్లుగా బతుకుతుంటారు. ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం మాత్రమే కాక.. ఉద్యోగ భద్రత, సమాజంలో గౌరవం వంటి అంశాలన్నీ.. ప్రభుత్వ ఉద్యోగం మీద ఆసక్తి పెంచుతాయి. మరి సర్కార్‌ కొలువు కొట్టడం సులభమా అంటే.. కానే కాదు. ఏళ్ల తరబడి చదివినా ఉద్యోగం వస్తుందని గ్యారెంటీగా చెప్పలేము. వచ్చిన వాళ్లది అదృష్టం.. రాని వాళ్లది దురదృష్టం అనుకోవాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య వందలు, వేలల్లో ఉంటే.. అందుకోసం పోటీ పడే వారి సఖ్య లక్షల్లో ఉంటుంది.

ఎంత చిన్నదైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంటే చాలు అని భావించేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అందుకే గుమస్తా కొలువు కోసం సైతం పీజీలు చేసిన వారు దరఖాస్తు చేసుకుంటున్నారంటే.. వీటికి ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇంట్లో ఒక్క వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే.. ఎంతో గ్రేట్‌ అనుకుంటాము.. అలాంటిది ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫ్యామిలీలో మాత్రం అన్నాచెల్లెళ్లిద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో వారి సంతోషం డబుల్‌ అయ్యింది. ఆ వివరాలు..

Both the elder sisters got government jobs at the same time

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన స్టాఫ్‌ నర్స్‌ ఫలితాలను ఆదివారం వెల్లడించారు. ఈ క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లిద్దరూ ఈ కొలువుకు ఎంపికయ్యారు. వారే కరీనంగర్‌కు చెందిన కుమారస్వామి, శిరీష. వీరి స్వస్థలం కరీంనగర్‌ జిల్లా, శంకరపట్నం మండలం లింగాపూర్‌. గ్రామానికి చెందిన రాజ కనకయ్య-కోమల దంపతులు వీరి తల్లిదండ్రులు. కొన్ని సంవత్సరాల క్రితం వీరి తండ్రి కనకయ్య మృతి చెందాడు. బిడ్డలిద్దరి భారం తల్లి కోమల మీద పడింది. సాధారణంగా కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు చనిపోతే.. పిల్లల పరిస్థితి దయనీయంగా మారుతుంది. అయితే కుమారస్వామి, శిరీషలు ఈ విషయంలో అదృష్టవంతులనే చెప్పవచ్చు.

తండ్రి చనిపోయి.. కుటుంబం గడవడం కష్టంగా ఉన్నా సరే.. వారి తల్లి కోమల బిడ్డల చదువులను అశ్రద్ధ చేయలేదు. తమకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ దానిపై వచ్చే ఆదాయంతోనే.. పిల్లలిద్దరని చదివించింది. తల్లి కష్టాన్ని చూస్తూ పెరిగిన ఈ అన్నాచెల్లెళ్లిదరూ కూడా కష్టపడి చదువుకున్నారు. నర్సింగ్‌ పూర్తి చేశారు. ఈ క్రమంలో 2022, మార్చిలో తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో వెల్లడించిన స్టాఫ్‌ నర్స్‌ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు. ఆ తర్వాత నిర్వహించిన సీబీటీ పరీక్ష రాశారు.

ఇక తాజాగా ఆదివారం నాడు అనగా జనవరి 28 సాయంత్రం ఇందుకు సంబంధించిన ఫలితాలు వెలువడగా.. అన్నాచెల్లెళ్లు అయిన కుమారస్వామి, శిరీష ఇద్దరూ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ విషయం తెలిసి వారి కన్నతల్లి కోమల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బిడ్డలిద్దరూ తన నమ్మకాన్ని వమ్ము చేయలేదని ఆనందం వ్యక్తం చేస్తుంది. తండ్రి లేకపోయినా.. తల్లి కష్టంతో బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన అన్నాచెల్లెళ్లిద్దరని గ్రామస్తులు అభినందిస్తున్నారు. వీరు ఎందరికో ఆదర్శం అంటున్నారు.