Dharani
హైదరాబాద్‌లో అత్యంత దారుణం చోటు చేసుకుంది.. చేయని నేరాన్ని అంగీకరించమంటూ.. ఓ మహిళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు పోలీసులు. ఆ వివరాలు..
హైదరాబాద్‌లో అత్యంత దారుణం చోటు చేసుకుంది.. చేయని నేరాన్ని అంగీకరించమంటూ.. ఓ మహిళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు పోలీసులు. ఆ వివరాలు..
Dharani
పోలీసులంటే నేటికి కూడా మన సమాజంలో ఒక రకమైన నెగిటివ్ అభిప్రాయం ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ అంటూ ఎన్ని మార్పులు చేసినా.. కొందరు ఖాకీలు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు.. కొన్ని సందర్భాల్లో అమానుషంగా ప్రవర్తిస్తారు. చేయని నేరాలకు అమాయకులను బలి తీసుకుంటారు. వారి చేత బలవంతంగా నేరాలను ఒప్పించడం కోసం.. ఎంతకైనా దిగజారతారు. అవసరమైతే వారిని దారుణంగా హింసించి.. చివరకు థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించి.. చేయని నేరం అంగీకరించేలా చేస్తారు. తాజాగా ఇదే ఘటన చోటు చేసుకుంది. తప్పు చేయని మహిళను నేరం అంగీకరించేలా చేయడం కోసం ఆమె మీద ఏకంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
చేయని నేరాన్ని ఒప్పుకోవాలంటూ ఓ మహిళను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. ఆమె చేతులు, కాళ్ల మీద లాఠీలతో చితకబాదారు. ఈ ఘటనలో ఆమె బాబాయిని కూడా విచారణకు పిలవడంతో.. అతడు భయపడి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంచలన ఘటన బాచుపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చిత్తారపు లక్ష్మీ, తాతారావు భార్యభర్తలు. తాతారావు బాచుపల్లి రాజీవ్‌గాంధీ నగర్‌లోని జయదీప్ ఎస్టేట్‌లోని ఎన్‌డీ–5 అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మేన్‌గా, లక్ష్మీ ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం లక్ష్మీ తాము ఉండే అపార్ట్‌మెంట్‌లో ఒకరి ఇంటికి పనికి వెళ్లడం మొదలు పెట్టింది. అయితే గత నెల 18న వారి ఇంట్లో బంగారు గొలుసు చోరికి గురైంది.
ఈ క్రమంలో ఆ ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలో తమ ఇంట్లో పని చేసే లక్ష్మీ మీద అనుమానం ఉంది అని సదరు ఇంటి యజమాని అనుమానం వ్యక్తం చేయడంతో.. లక్ష్మీని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు పోలీసులు. గొలుసు గురించి ప్రశ్నించారు. తాను దొంగతనం చేయాలేదని ఆమె ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. ఏదో ఒకటి తెచ్చి ఇస్తే వదిలేస్తామని తెలిపారు. కానీ లక్ష్మీ ఒప్పుకోకపోవడంతో ఆమెను స్టేషన్‌కు తీసుకువచ్చి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించి.. చిత్రహింసలకు గురిచేశారు. కాళ్లు, చేతుల మీద చితకబాదారు. ఈ హింసబ తట్టుకోలేక పోయిన లక్ష్మీ తన బాబాయ్ రాజేష్ మెడలోని గొలుసును తీసుకొచ్చి పోలీసులకు అప్పగించింది. అయితే అది తన చెయిన్ కాదని యజమాని చెప్పడంతో తిరిగి దానిని లక్ష్మీకి అప్పగించారు.
ఈ క్రమంలో పోలీసులు లక్ష్మీ, ఆమె బాబాయ్‌ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అప్పటికే లక్ష‍్మీని చిత్రహింసలు పెట్టడంతో.. తనను కూడా కొడతారేమోనని భయపడిపోయిన లక్ష్మీ బాబాయ్ రాజేష్ పోలీస్ స్టేషన్ గేటు ఎదుట పురుగులమందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అతడిని కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడి వైద్యానికి రోజుకు రూ.45 వేలు ఖర్చు అవుతుందని ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిపోతామని బాధితులు బదులిచ్చారు.
బయటికి వెళితే అసలు విషయం బట్టబయలవుతుందని భావించిన పోలీసులు.. వైద్య ఖర్చులు తామే భరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉండగా.. పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళితే ఎవరూ స్వీకరించకపోవడం గమనార్హం. చేయని నేరానికి మమ్మల్ని మానసికంగా, శారీరకంగా హింసించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని లక్ష్మీ, రాజేష్ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.