Dharani
Security To HYDRA Commissioner Ranganath: హైడ్రా దూకుడు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
Security To HYDRA Commissioner Ranganath: హైడ్రా దూకుడు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసిన హైడ్రా పేరే ఎక్కువగా వినిపిస్తోంది.. కనిపిస్తోంది. చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేసి చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. పేదలు, సామాన్యులు, సినీ, రాజకీయ సెలబ్రిటీలు అనే తేడా లేకుండా.. ఆక్రమణలకు పాల్పడిన వారి పట్ల సింహస్వప్నంగా మారింది హైడ్రా. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా పేరు మార్మోగిపోయింది. అక్రమార్కులు హైడ్రా పేరు వింటినే వణికిపోతుంటే.. సామాన్యులు మాత్రం.. జేజేలు కొడుతున్నారు. హైడ్రా దూకుడు వెనక ఉన్న వ్యక్తి ఆ వ్యవస్థ కమిషనర్ రంగనాథ్. హైడ్రా.. అక్రమ కట్టడాల తొలగింపు వేగవంతం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి.. అక్రమ నిర్మణాలు చేపట్టిన వారి విషయంలో హైడ్రా దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు భద్రత పెంచింది. ఈ మేరకు వెంగళ్‌రావునగర్ డివిజన్ మధురానగర్ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్‌పోస్టును ఏర్పాటు చేశారు. హైడ్రా చర్యల నేపథ్యంలో ఆయనకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందనే అనుమానంతో.. ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
అలాగే అయనకు భద్రతా సిబ్బందితో కూడిన కాన్వాయ్ ను కూడా ప్రభుత్వం సమకూర్చింది. ఇటీవల సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత బడా రాజకీయ నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాలను తొలగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా రంగనాథ్ ఇంటి వద్ద భద్రత పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
చెరువుల పరిరక్షణ, చెరువుల్లో కబ్జాలు, ఆక్రమణలు తొలగించేందుకు సీఎం రేవంత్ ఏర్పాటు చేసిన హైడ్రాపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత.. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అలానే మాదాపూర్ పరిధిలోని చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు హైడ్రా నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఇక ఈ 58 రోజుల పరిధిలోనే హైడ్రా నగర వ్యాప్తంగా 18 చోట్ల చెరువులు, పార్కు స్థలాల్లోని సుమారు 166 ఆక్రమణలు నేలమట్టం చేసింది. ఇక వీటి విస్తీర్ణం 43.94 ఎకరాలు అని తెలిస్తుంది.