P Venkatesh
Sadar Festival: హైదరాబాద్ నగరం సదర్ ఉత్సవాలకు ముస్తాబైంది. యాదవులు అంగరంగ వైభవంగా సదర్ ఉత్సవాలను జరిపేందుకు సిద్ధమయ్యారు. సదర్ వేడుకల పూర్తి వివరాలు మీకోసం..
Sadar Festival: హైదరాబాద్ నగరం సదర్ ఉత్సవాలకు ముస్తాబైంది. యాదవులు అంగరంగ వైభవంగా సదర్ ఉత్సవాలను జరిపేందుకు సిద్ధమయ్యారు. సదర్ వేడుకల పూర్తి వివరాలు మీకోసం..
P Venkatesh
పండగ రోజుల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఊరు, వాడ ఏకమై ప్రజలంతా ఒక్కచోట చేరి పండగలను ఆనందంగా జరుపుకుంటారు. ఉగాది, దసరా, దీపావళి, వినాయక చవితి, బతుకమ్మ, బోనాలు ఇలా రకరకాల పండగలు ఉన్నాయి. ఒక్కో పండగ ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అయితే ఈ పండగలన్ని పల్లెలు, పట్టణాల్లో జరుపుకుంటారు. ఇక ఇప్పుడు దీపావళి సందడి షురువైంది. ప్రజలంతా దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు రెడీ అయ్యారు. దీపావళి ఫెస్టివల్ అనగానే గుర్తొచ్చేది సదర్ ఉత్సవాలు. యాదవులు సాంస్కృతిక ప్రతీకగా సదర్ ఉత్సవాలు జరుపుకుంటారు. అయితే సదర్ ఉత్సవాలు హైదరాబాద్ లో మాత్రమే జరుపుకుంటారు.
హైదరాబాద్ నగరం సదర్ ఉత్సవాలకు ముస్తాబైంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా సదర్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి సదర్ ఉత్సవాల కోసం భారీ దున్నలు నగరానికి చేరుకున్నాయి. భిన్న సంస్కృతి,సంప్రదాయాలకు నిలయం హైదరాబాద్ నగరం. దీపావళి వేళ జంటనగరాలు సదర్ ఉత్సవాలకు రెడీ అయ్యాయి. అసలు ఈ సదర్ వేడుకలు హైదరాబాద్ లోనే జరుపుకోవడానికి గల కారణం ఏంటి? సదర్ అంటే అర్థం ఏంటి? సదర్ ఉత్సవాల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్ నగరంలో సదర్ ఉత్సవాలను ధూమ్ ధామ్ గా నిర్వహిస్తారు. సదర్ అనే ఉర్దూ పదానికి ఆత్మ విశ్వాసం, లీడర్ అనే అర్థాలు ఉన్నాయి. సదర్ అంటే హైదరాబాదీ వ్యవహారికం ప్రకారం ప్రధానమైనది అని అర్థం. హైదరాద్ లో జరిగే ప్రధాన ఉత్సవాల్లో సదర్ ఉత్సవం ఒకటి. నగరంలోని యదవులు మాత్రమే సదర్ ఉత్సవాలను జరుపుకుంటారు. దీపావళి ముగిసిన రెండు రోజులకు సదర్ ఉత్సవాలను జరుపుకుంటారు. దీన్ని దున్నపోతుల ఉత్సవం అని కూడా అంటారు. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఈ ఉత్సవం ప్రత్యేక విశేషం.
సదర్ చరిత్ర:
యాదవులు జరుపుకునే ఈ సదర్ ఉత్సవాలు ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి సింధు నాగరికతలో భాగంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణలో సదర్ ఉత్సవాలు దేవగిరి యాదవ రాజుల కాలంలో వ్యాప్తి చెందాయి. వీరు కాకతీయుల కన్నా ముందే గొల్లకొండగా పిలిచే ప్రస్తుత గోల్కొండను కేంద్రంగా చేసుకుని జీవించేవారని చరిత్ర చెబుతోంది. తర్వాతి కాలంలో గొల్లకొండ ప్రాంతాన్ని పాలించే గొల్లల రాణి (యాదవుల రాణి) కుతుబ్ షాహీ దండయాత్రలను ఐదు దున్నపోతుల సహాయంతో ఎదుర్కొని పోరాడి వీర మరణం పొందిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దున్నపోతుల వీరత్వానికి ప్రతీకగా సదరు ఉత్సవాలు జరుపుతున్నట్లు చరిత్ర చెబుతోంది. కుతుబ్ షాహిలు, మొగలులు, నిజాంముల కాలంలో యాదవ వీరులు సైనికాధికారులుగా, అంగరక్షకులుగా సమర్థవంతంగా పనిచేశారు. నిజాం వారి సేవలను గుర్తించి గౌలిగూడను (ఒకప్పుడు దీన్ని గొల్లగూడ అనేవారు. అక్కడ పాల ఉత్పత్తులు ఎక్కువగా అమ్మడం వల్ల ఆ పేరొచ్చింది.) ఇనామ్‌గా ఇచ్చాడని చరిత్ర చెబుతుంది. అక్కడి నుంచే సదర్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని మరొక ప్రచారం.
హైదరాబాద్ లో సదర్ ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతాయి. నగరంలోని కాచిగూడ, నారాయణగూడ, ఖైరతా బాద్, సైదాబాద్, బోయిన్‌పల్లి, ఈస్ట్‌మారెడ్ పల్లి, చప్ప ల్‌బజార్, మధురాపూర్, కార్వాన్, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇప్పటి వరకూ నారాయణగూడలో జరిగే ఉత్సవాలు నగర దృష్టిని ఆకర్శించే స్థాయిలో సాగుతున్నాయి. యాదవ కులస్తులు ఎక్కువగా ఉండే మున్సిపల్ డివిజన్లు, కాలనీల్లో ఎక్కువ జరుగుతున్నాయి. సదర్ ఉత్సవాల కోసం పంజాబ్, హర్యానాల నుంచి భారీ శరీరం కలిగిన దున్నపోతులను నగరానికి తీసుకువస్తారు. ఆధునిక సదర్ ఉత్సవాలు మాత్రం 1946 నుంచి స్వర్గీయ చౌదరి మల్లయ్య యాదవ్, నారాయణ గూడ వైఎంసీలో ప్రారంభించినట్లు తెలుస్తోంది. యాదవులకు ఈ ఉత్సవమే లక్ష్మీ పూజ లాంటింది. అందుకనే ప్రత్యేకించి సదరు ఉత్సవం రోజున వాటికి శుభ్రంగా స్నానం చేయించి, పూలదండలతో అలంకరించి పండుగలా జరుపుకుంటారు. యాదవుల ఐక్యతకు, మూగ జీవాల పట్ల వారికున్న ప్రేమానురాగాలకు నిదర్శనంగా నిలుస్తాయి సదర్ ఉత్సవాలు.
సదర్ పండగను దృష్టిలో పెట్టుకొని దున్నపోతులను పెంచుతారు. అవి దృఢంగా ఉండడంకోసం కొన్ని నెలలపాటు వాటికి పోషక విలువలు కలిగిన తవుడు, దాన, గానుగ, పచ్చగడ్డి, కుడితి వంటివి పెడుతారు. పండగకు వారం ముందుగానే అలంకరణ ప్రారంభిస్తారు. దున్నపోతు శరీరంపై ఉన్న వెంట్రుకలను తొలగించి నల్లగా నిగనిగలాడేలా తయారు చేస్తారు. కొమ్ములను రంగురంగుల రిబ్బన్లతో చుడతారు. ఆ తర్వాత డప్పు చప్పుల్లతో డ్యాన్సులతో దున్న రాజులు బయలుదేరి తన చురుకుదనాన్ని, బలిష్టతను ప్రదర్శిస్తాయి. వాటిని ప్రధానంగా దాని వెనుక కాళ్లపై నిలబడేలా చేస్తారు. ఏ దున్నపోతైతే ఎక్కువ ఎత్తుకు తన ముందు కాళ్ళను లేపుతుందో ఆ దున్నపోతుకు బహుమతి ప్రదానం చేస్తారు. సదర్ ఉత్సవాలను తిలకించేందుకు ప్రజలంతా ఆసక్తి కనబరుస్తారు.