Revanth Reddy: హైడ్రా సంచలనం.. CM రేవంత్‌ సోదరుడి ఇంటికి నోటీసులు!

HYDRA Notices To CM Revanth Reddy Brother: అక్రమ నిర్మాణాలపై దూకుడుగా వెళ్తున్న హైడ్రా.. తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డి సోదరుడి ఇంటికి నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..

HYDRA Notices To CM Revanth Reddy Brother: అక్రమ నిర్మాణాలపై దూకుడుగా వెళ్తున్న హైడ్రా.. తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డి సోదరుడి ఇంటికి నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..

హైదరాబాద్‌ నగరంలోని చెరువులను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలు, ప్రభుత్వ భూములు, నాలాలను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైడ్రా వ్యవవస్థను ఏర్పాటు చేశారు. ప్రారంభం నుంచే ఇది దూకుడుగా ముందుకు వెళ్తుంది. సామాన్యులు, పేదలు, సినీ, రాజకీయ సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఆక్రమణలకు పాల్పడ్డ వారిపై కొరడా ఝుళిపిస్తోంది. పేదలైనా, సెలబ్రిటీలైనా ఎవరైనా తనకు ఒక్కరే అని ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతతో నిరూపించుకుంది హైడ్రా. ఈ క్రమంలో తాజాగా మరో సంచలనానికి తెర తీసింది హైడ్రా. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులు జారీ చేసి.. మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ వివరాలు..

హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల కబ్జాలపై దూకుడుగా వెళ్తున్న హైడ్రా.. తాజాగా బుధవారం నాడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులను అంటించి తన దృష్టిలో అందరూ సమానమే అని చెప్పుకొచ్చింది హైడ్రా. మాదాపూర్‌ అమర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు, కార్యాలయం దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. వాటికి నోటీసులు జారీ చేశారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన ఆ అక్రమ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేసిన రెవెన్యూ అధికారులు.. అందుకు నెల రోజుల గడువు ఇచ్చారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌/ తహసీల్దార్‌.. దుర్గంచెరువుకు ఆనుకుని ఉన్న నెక్టర్స్‌ కాలనీ, డాక్టర్స్‌ కాలనీ, కావూరి హిల్స్‌, అమర్‌ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేయగా.. ఆ మేరకు పలు ఇళ్లకు వాటిని అంటించారు. వీరికి కూడా నెల రోజుల గడువు ఇచ్చి, ఎఫ్‌టీఎల్‌ను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. బుధవారం ఒక్కరోజే హైడ్రా.. దుర్గం చెరువు పరిసరాల్లోని నాలుగు కాలనీల్లోని వందల ఇళ్లు, కమర్షియల్ కాంప్లెక్సులకు వాల్టా చట్టంలోని సెక్షన్‌ 23(1) కింద నోటీసులు ఇచ్చింది. ఇవన్నీ అక్రమ నిర్మాణాలు అని.. కనుక వీటిని స్వచ్ఛందంగా కూల్చి వేయాలని.. లేని పక్షంలో తామే కూల్చివేతలు చేపడతామని అధికారులు హెచ్చరించారు. హైడ్రా నోటీసులు నేపథ్యంలో ఆ కాలనీల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

వాస్తవానికి దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి జీహెచ్‌ఎంసీ వేసిన హద్దురాళ్లను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ చెరువు సగం భాగంలోకి నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు చొచ్చుకొచ్చాయి. పదేళ్ల కిందట ప్రాథమిక నోటిఫికేషన్‌ ద్వారా ఎఫ్‌టీఎల్‌ను గుర్తించినా.. ఎటువంటి రక్షణ కల్పించలేదు. తొలుత గుట్టలు ఉన్న ప్రాంతంలో వంద ఎకరాలకుపైగా విస్తరించి ఉందని అధికారులు అంచనా వేశారు. కానీ, సర్వే తర్వాత దాని విస్తీర్ణం 84 ఎకరాల్లోనే ఉందని నిర్దారించారు. అయితే.. హైటెక్‌సిటీ నిర్మాణం తర్వాత క్రమంగా చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగాయి. ఇప్పుడు హైడ్రా నోటీసుల వల్ల ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో చూడాలి అంటున్నారు.

Show comments