Hyderabad-New Rules For Heavy Vehicles, Private Travels Bus: Hyderabad కొత్త రూల్స్.. ఉదయం 7 దాటితే ఆ వాహనాలకు నో ఎంట్రీ.. !

Hyderabad కొత్త రూల్స్.. ఉదయం 7 దాటితే ఆ వాహనాలకు నో ఎంట్రీ.. !

Hyderabad-Heavy Vehicles: హైదరాబాద్ నగరంలోకి వచ్చే వాహనాలకు సంబంధించి పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ఆ వివరాలు..

Hyderabad-Heavy Vehicles: హైదరాబాద్ నగరంలోకి వచ్చే వాహనాలకు సంబంధించి పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ఆ వివరాలు..

భాగ్యనగరంలో జనాభా ఎంత ఉంటుందో అందుకు తగ్గట్టుగానే వాహనాల సంఖ్య ఉంది. నేటి కాలంలో ఇంటికో బండి అన్నది కామన్ కాగా.. మనిషికో వాహనం అన్న ట్రేండ్ నడుస్తోంది. ఇక భాగ్యనగరంలో రోడ్ల మీద చూడాలి ట్రాఫిక్.. ఇసుకేస్తే రాలనంత జనం. మరీ ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళ భారీ రద్దీ ఉంటుంది. ఇక్కడ ఉండే వాళ్లు మాత్రమే కాక.. వ్యాపార, వాణిజ్య, రవాణా నిమిత్తం ఎక్కెడక్కడి నుంచో భారీ ఎత్తున వాహనాలు నిత్యం నగరంలోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సాయంత్రం ఏడు గంటలు దాటితే నగరంలోకి ఆ వాహనాల ఎంట్రీకి నో చెప్పారు. ఆ వివరాలు..

హైదరాబాద్‌‌ పోలీసులు మరో అలర్ట్ జారీ చేశారు. నగరంలో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిగణలోకి తీసుకుని.. కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నగరంలో.. భారీ వాహనాలు ఇష్టారీతిన తిరుగుతున్నాయని.. దాని వల్ల మిగతా వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని పలువురు నగరవాసులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ భారీ వాహనాల వల్ల ట్రాఫిక్ సమస్య మాత్రమే కాక.. ప్రమాదాలు కూడా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

ట్రాఫిక్ రద్దీని తగ్గించటంతో పాటు ప్రమాదాల నివారణకు గాను నగరంలోకి పలు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ.. నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నేఫథ్యంలోనే.. భారీ వాహనాలు, నేషనల్ పర్మిట్ లారీలు, లోకల్ లారీలు, డీసీఎంలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రైవేటు బస్సులపై ఆంక్షలు విధించారు. లోకల్ లారీలు, భారీ వాహనాలకు.. ఉదయం 7 గంటల తర్వాత నగరంలోకి ఎంట్రీ లేదని నిబంధనలు జారీ చేశారు.

అలానే నగరంలోకి నిత్యం వివిధ రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో ప్రైవేటు బస్సులు వస్తుంటాయి. వాటి రాకపోకలపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రైవేటు బస్సులకు ఉదయం 8 గంటల తర్వాత నగరంలోకి ఎంట్రీ లేదని ఆదేశించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రైవేటు బస్సులనకు హైదరాబాద్ నగరంలోకి అనుమతి ఉండదని ఆదేశాలు జారీ చేశారు.

ఇకపోతే.. సామాగ్రిని తరలించే స్థానిక వాహనాలకు సంబంధించి వాటిని రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి.. నగరంలోకి వచ్చే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లోని 94 మార్గాల్లో ఈ నిబంధనలు వర్తిస్తాయని సీపీ వివరించారు.

ఇక.. 2 రోజుల క్రితం హబ్సిగూడలో లారీ ఢీకొని ఓ పదో తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటనకు కూడా ఇదే కారణమని స్థానికులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Show comments