iDreamPost
android-app
ios-app

హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ గవర్నర్ ఆమోదం.. రానున్న హై పవర్స్

హైడ్రాకు మరిన్ని పవర్ రాబోతున్నాయి. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ రూపొందించిన ఆర్డినెన్సుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు.

హైడ్రాకు మరిన్ని పవర్ రాబోతున్నాయి. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ రూపొందించిన ఆర్డినెన్సుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు.

హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ గవర్నర్ ఆమోదం.. రానున్న హై పవర్స్

హైదరాబాద్ నగరంలో అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించిన హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్ అండ్‌ ప్రొటెక్షన్‌) మరింత బలోపేతం కాబోతుంది. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చర్యతో హైడ్రాకు విసృత్తాధికారాలు రాబోతున్నాయి. హైడ్రాకు చట్టబద్ధత లేదంటూ, నిర్మాణాలను ఎలా కూల్చేస్తారంటూ ప్రతిపక్షాలు విరుచుకు పడ్డాయి. అలాగే హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని, పూర్తి అధికారాలు కట్టబెట్టాలని నిర్ణయించుకుంది. ఆర్డినెస్స్ రూపొందించి.. గవర్నర్ ముందుంచింది. కోర్టు విచారణ కొనసాగుతుండగానే.. జిష్ణు దేవ్ ఆర్డినెస్స్‌కు ఆమోద ముద్ర వేశారు.

ఈ బిల్లును రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల వ్యవధిలో ఈ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది. భాగ్య నగరిలో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ఆట స్థలాలను పరిరక్షించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా తీసుకువచ్చింది. దీనికి కమిషనర్‌గా రంగనాథ్‌ను నియమించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్చాజిగిరి జిల్లాల పరిధిలో ఓఆర్ఆర్ వరకు విస్తరించిన ప్రాంతాన్ని పరిధిలో చేర్చింది. రంగనాథ్ ఆధ్వర్వంలో హైడ్రా దూకుడుగా వ్యవహరించింది. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపింది. బఫర్ జోన్స్, ఎఫ్టీఎల్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. కబ్జా కోరులను నిద్రలేకుండా చేసింది. సామాన్యులే కాదు నాగార్జున లాంటి సెలబ్రిటీకి సంబంధించిన ఆస్తులను నేలమట్టం చేసింది.

ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ అని తెలియగానే.. వాటిని కూల్చివేసింది. అలాగే హైడ్రాను బలోపేతం చేసేందుకు పలువురు ఉన్నతాధికారులు, సిబ్బందిని కూడా ప్రభుత్వం కేటాయించింది. ఈ క్రమంలో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ గళమెత్తాయి. కోర్టును ఆశ్రయించాయి. విమర్శకుల నోళ్లను మూయించేందుకు హైడ్రాకు చట్టబద్దత కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఆర్డినెస్స్ గవర్నర్ జిష్ణు దేవ్ ముందుంచింది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్. గవర్నర్ కొన్ని సందేహాలు వ్యక్తం చేయగా.. పురపాలక ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ నివృత్తి చేశారు. అనంతరం ఆర్డినెన్స్‎కు గవర్నర్ జిష్ణు దేవ్ ఆమోదం తెలిపారు. దీంతో కొన్ని పవర్స్ వచ్చి చేరనున్నాయి. మున్సిపల్ చట్టాల్లో మార్పులు రాబోతున్నాయి. ఆక్రమణలు పరిశీలించి, నోటీసులు ఇవ్వడం, ఆక్రమణల తొలగించే అధికారాలు హైడ్రాకు వచ్చి చేరతాయి. ఇక మరింత జెట్ స్పీడుతో దూసుకెళుతుందేమో చూడాలి. హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఈ పరిణామాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.