సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం.. ఆ ఇళ్లకు ‘గృహలక్ష్మి ’!

తెలంగాణలో కొద్దిరోజుల క్రితం భారీ వర్షాలు దంచి కొట్టిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు రోజులకు పైగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ఈ నేపథ్యంలోనే వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు, పలు ఊర్లు జలమయం అయ్యాయి. ఇక, వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా చాలా ఇళ్లు కూలిపోవటం.. పాడవటం జరిగింది. అలాంటి ఇళ్ల వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వర్షాల కారణంగా పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు గృహలక్ష్మి పథకం వర్తింప జేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాదు! పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు కూడా తగిన పరిహారం అందించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదల కారణంగా మొత్తం 419 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. వీటన్నింటికి గృహలక్ష్మి పథకం వర్తించనుంది. వీటితో పాటు పాక్షికంగా దెబ్బతిన్న 7,505 ఇళ్లకు పరిహారం అందనుంది. ఇక, పట్టణ.. గ్రామీణ ప్రాంతాల్లో భారీ వర్షాల నేపథ్యంలో చనిపోయిన వారి కుటుంబాలకు దాదాపు 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందనుంది.

ఇక, దీనిపై రోడ్లు- భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్రం వరదల్లో నష్టపోతే కేంద్ర ప్రభుత్వం సాయం చేయలేదు. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వమే బాధితులను ఆదుకుంది. తెలంగాణలో ఈ సారి ఎన్నడూ లేనంతగా వర్షాలు నమోదయ్యాయి. వానలు, వరదలపై కేసీఆర్‌ నిరంతర సమీక్ష జరిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో అర్థరాత్రి వరకు సమీక్షలు నిర్వహించారు. కేసీఆర్‌ ఫొటోల కోసం ఫోజులిచ్చే నాయకుడు కాదు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు’’ అని అన్నారు. మరి, వర్షాలు, వరదల కారణంగా దెబ్బ తిన్న ఇళ్లకు కేసీఆర్‌ ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకాన్ని వర్తింపజేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments