Dharani
Zero Current Bill: తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన గృహజ్యోతి స్కీమ్ మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే చాలా మందికి సున్నా కరెంట్ బిల్లులు రాలేదు. వారు ఏం చేయాలంటే..
Zero Current Bill: తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన గృహజ్యోతి స్కీమ్ మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే చాలా మందికి సున్నా కరెంట్ బిల్లులు రాలేదు. వారు ఏం చేయాలంటే..
Dharani
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితం అని ప్రకటించారు. మార్చి 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలో సుమారు 10 లక్షలకు పైగా వినియోగదారులకు జీరో విద్యుత్ బిల్లులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నెలలో ఇంకా చాలా మందికి జీరో బిల్లులు రాలేదు. మరి అలాంటి వారు ఏం చేయాలి.. అంటే..
తెలంగాణ వ్యాప్తంగా మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి వస్తుంది. దీనిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికి సున్నా బిల్లులు జారీ చేస్తున్నారు విద్యుత్ సిబ్బంది. దీనిలో భాగంగా 5వ తేదీ వరకు టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో 2.5 లక్షలు, ఎస్పీడీసీఎల్ పరిధిలో 7.5 లక్షల మంది వినియోగదారులకు జీరో బిల్లులు అందించారు. తెలంగాణ వ్యాప్తంగా తొలి విడతలో భాగంగా గృహజ్యోతి పథకం కోసం సుమారు 39.9 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం.
లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చేలోపే వీరందరికీ సున్నా బిల్లింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. అయితే క్షేత్రస్థాయిలో అనుకున్నంత వేగంగా ఈ పనులు సాగడం లేదు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో గృహజ్యోతి పథకాన్ని ఇంకా ప్రారంభించలేదు.
అయితే కోడ్ అమల్లో లేని కొన్ని జిల్లాల్లో కూడా చాలా మందికి జీరో బిల్లులు రావటం లేదు. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించినా సరే సున్నా బిల్లులు రావడం లేదు. దాంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడమే కాక.. రేషన్ కార్డు ఉన్నా సరే తమకు సున్నా బిల్లులు రాలేదని వారు వాపోతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ సిబ్బంది.. క్లారిటీ ఇచ్చింది.
వారిచ్చిన రేషన్ కార్డులు, ఆధార్, విద్యుత్ సర్వీస్ నంబర్లలో తప్పులు ఉండడం, డేటా ఎంట్రీలో పొరపాట్ల కారణంగా కొందరు వినియోగదారులకు సంబంధించి ఇంకా సమాచార ధ్రువీకరణ జరగలేదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. అర్హులుగా ఉండి జీరో బిల్లులు రానివారు మళ్లీ అప్లై చేయాలని సూచిస్తున్నారు. అర్హులై జీరో బిల్లులు రాని వారు.. తమ మండల పరిధిలోని ఎంపీడీవో ఆఫీసుకు వెళ్లి మరోసారి దరఖాస్తులు చేసుకోవాలని చెబుతున్నారు. జీరో బిల్లులపై పూర్తి సమాచారం శాఖకు చేరగానే ఆ మరుసటి నెల నుంచే సున్నా బిల్లులు వర్తింపజేస్తామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.