iDreamPost
android-app
ios-app

ఆఖరి కోరిక తీరకుండానే మరణించిన గద్దర్‌!

ఆఖరి కోరిక తీరకుండానే మరణించిన గద్దర్‌!

ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్‌ ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం గుండెపోటుకు గురైన ఆయన అమీర్‌ పేటలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. ఇక, అప్పటినుంచి అక్కడే చికిత్స తీసుకుంటూ ఉన్నారు. గుండె పోటుతో పాటు ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలు కూడా తెలత్తడంతో ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవటంతో చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూశారు.

ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసిన గద్దర్‌ చివరి వరకు ప్రజల కోసమే పోరాడారు. ప్రజలకోసం ప్రభుత్వాలతో కొట్లాడారు. ప్రజల కోసం ఎంతో చేసిన ఆయన తన ఆఖరి కోరిక తీరకుండానే చనిపోవటం గమనార్హం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు గద్దర్‌ ప్రజాక్షేత్రంలోకి దిగాలని భావించారట. వచ్చే ఎన్నికల్లో లోక్‌ సభకు పోటీ చేయాలని అనుకున్నారట. ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి నుంచి ఆయన పోటీ చేయనున్నారన్న ప్రచారం కూడా గతంలో జరిగింది. అయితే, ఎన్నికల్లో పోటీ చేయాలన్న కోరిక తీరకుండానే ఆయన మరణించారు.

కాగా, గద్దర్‌ 1949లో తూఫ్రాన్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్‌రావ్‌. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1975లో కెనరా బ్యాంకులో పని చేశారు. తర్వాత పూర్తి స్థాయిగా ప్రజా గాయకుడిగా మారారు. తన పాటలతో ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పాటలతో ఉద్యమానికి ఊపు నిచ్చారు. కారంచేడు హత్యలపై కూడా ఆయన పోరాటం చేశారు. అంతేకాదు.. నకిలీ ఎన్‌కౌంటర్లను వ్యతిరేకించిన నేపథ్యంలో 1997లో ఆయనపై హత్యాయత్నం జరిగింది. మరి, ప్రజా గాయకుడు గద్దర్‌ తన ఆఖరి కోరిక తీరకుండానే మరణించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.