Dharani
ఆటో డ్రైవర్లు కొందరు ఆర్టీసీ బస్సులోకి ఎక్కి ప్రయాణికుల వద్ద భిక్షాటన చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాలు..
ఆటో డ్రైవర్లు కొందరు ఆర్టీసీ బస్సులోకి ఎక్కి ప్రయాణికుల వద్ద భిక్షాటన చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు భిక్షమెత్తుకుంటున్నారు. రోడ్ల మీద కాదు.. ఏకంగా బస్సులోకి ఎక్కి మరీ ప్రయాణికుల వద్దకు వెళ్లి చేయి చాచి అడుక్కుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఇంతకు ఏం జరిగింది.. ఎందుకు ఆటో డ్రైవర్లు ఇలా బిచ్చమెత్తుకుంటున్నారు.. కారణం ఏంటి అంటే ఉచిత జర్నీ పథకం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని అమలు చేశారు. డిసెంబర్ 9నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చింది.
ఈ పథకంపై మహిళలు ప్రశంసలు కురిపిస్తుండగా.. ఆటో, ర్యాపిడో, క్యాబ్ డ్రైవర్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వల్ల తమకు గిరాకీ తగ్గిందని.. ప్రయాణికులు రావడం లేదని.. ఇలానే ఉంటే తమ పరిస్థితి ఏంటి.. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆటో, ఊబర్ వాహనాల డ్రైవర్లతో సమావేశం అయిన సంగతి తెలిసిందే. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు.
అయినప్పటికీ ఆటో డ్రైవర్లు మాత్రం ఆందోళన వీడటం లేదు. ఈ పథకానికి నిరసనగా ప్రదర్శనలు చేయడం, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, సిబ్బంది పై దాడికి దిగడం వంటివి చేస్తున్నారు. ఇక తాజాగా ఓ అడుగు ముందుకు వేసి.. ఏకంగా బస్సులో భిక్షాటన కార్యక్రమం మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
మేడ్చల్లోని ఆటో డ్రైవర్లు.. బస్సులోకి ఎక్కి.. ప్రయాణికుల వద్ద భిక్షం వేయమని అడుక్కుంటున్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్ల బ్రతుకుతెరువు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే ఇలా బస్సులో భిక్షాటన చేస్తూ.. నిరసన తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం పథకం వల్ల తమ జీవనోపాధి పోయిందని ఆటో డ్రైవర్లు అల్లాడుతున్నారు. ఆటోల్లో ప్రయాణించేది అత్యధికంగా మహిళలేనని, అలాంటిది వారికి ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటోలు ఎవరు ఎక్కుతారని వారు ప్రశ్నిస్తున్నారు. తమను ఆదుకోవాలని కోరుతూ.. అనేక ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు ఆందోళనలకు దిగుతున్నారు.
బిక్షం అడుక్కుంటూ ఆటో డ్రైవర్ల నిరసన
మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్ల బ్రతుకుతెరువు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, మేడ్చల్లో ఆటో డ్రైవర్లు బిక్షం అడుక్కుంటూ నిరసన తెలిపారు. pic.twitter.com/eWcPnALvny
— Telugu Scribe (@TeluguScribe) January 4, 2024