iDreamPost
android-app
ios-app

మిద్దెలపై చేపల పెంపకం.. లక్షలు సంపాదిస్తున్న మహిళలు!

మిద్దెలపై చేపల పెంపకం.. లక్షలు సంపాదిస్తున్న మహిళలు!

మీకు మిద్దె తోటల గురించి తెలిసే ఉంటుంది. కాంక్రీట్‌ రూఫ్‌ టాప్‌ ఉన్న వారు ఎక్కువగా మిద్దె తోటల్ని పెంచుతూ ఉంటారు. హైబ్రీడ్‌ రకానికి చెందిన కూరగాయలు, పండ్ల మొక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మిద్దె తోటలకు దేశ వ్యాప్తంగా క్రేజ్‌ బాగా పెరిగింది. అయితే, ఇదే బాటలో కొందరు మహిళలు మిద్దెలపై చేపల్ని పెంచుతూ ఉన్నారు. చేపల్ని పెంచి అమ్మి.. లక్షలు సంపాదిస్తున్నారు. తెలంగాణలోని కామారెడ్డికి చెందిన మహిళలు ఈ ఘనతను సాధిస్తున్నారు.

ఆ వివరాల్లోకి వెళితే.. కామారెడ్డిలో భూంపల్లి స్వయం సహాయక సంఘాలకు చెందిన పలువురు మహిళలు ఇంటి మిద్దెలపై చేపలు పెంచుతున్నారు. కేవలం ఇళ్లపైనే కాదు.. పొలాల్లో కూడా నీటి ట్యాంకులు ఏర్పాటు చేసి చేపలు పెంచుతున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ వీరికి సహకరిస్తోంది. సదరు మహిళలు దాదాపు వారం రోజుల పాటు ట్రైనింగ్‌ తీసుకుని చేపల్ని పెంచుతున్నారు. 3 లక్షల రూపాయల లోన్‌ తీసుకుని వీరు చేపల్ని పెంచుతున్నారు. అంతేకాదు! లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. దీనిపై కామారెడ్డి డీఆర్‌డీఓ సాయన్న మాట్లాడుతూ..

‘‘ మిద్దెలపై చేపల పెంపకానికి సంబంధించి యూనిట్లు మంజూరు చేశాం. ఈ పథకం ద్వారా మిద్దెలపై 1000 కొర్రమీను చేపలు పెంచుకోవచ్చు. కొర్రమీను చేపలు ఒక్కోటి కేజి బరువు పెరుగుతాయి. కేజీ కొర్రమీను ధర 350 రూపాయలు ఉంటుంది. దాని వల్ల ప్రతీ క్రాపులో 3.50 లక్షల రూపాయలు వస్తాయి. ఓక్కో చేప కేజీన్నర ఆహారం తీసుకుంటుంది. వాటి ఆహారం ఖర్చు లక్ష పోను.. 2.50 లక్షలు మిగులుతాయి’’ అని తెలిపారు. మరి, మిద్దెపై చేపల పెంపకం ద్వారా లక్షలు సంపాదిస్తున్న కామారెడ్డి మహిళలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.