iDreamPost
android-app
ios-app

గుడ్డిగా ORS జ్యూసులు తాగుతున్నారా? జాగ్రత్త!

గుడ్డిగా ORS జ్యూసులు తాగుతున్నారా? జాగ్రత్త!

సాధారణంగా మనకు వాంతులు, విరేచనాలు అధికంగా అవుతున్నపుడు ఏం చేస్తాం?.. ఇక, ఏ మాత్రం ఆలోచించకుండా డాక్టర్లను సంప్రదిస్తాం. డాక్టర్లు ఇంజెక్షన్‌లు, మందులతో పాటు త్వరితగతిన శక్తి రావటానికి ఓఆర్‌ఎస్‌( ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌) తాగమని చెబుతూ ఉంటారు. మార్కెట్‌లో చాలా రకాల ఓఆర్‌ఎస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఓఆర్‌ఎస్‌ పౌడర్లు ఒకరకం అయితే.. ఓఆర్‌ఎస్‌ జ్యూసులు మరో రకం. అయితే, ఓఆర్‌ఎస్‌ జ్యూసుల్లో కొన్నిటి కారణంగా మన ఆరోగ్యం దెబ్బతింటుందని ప్రముఖ పిడియాట్రిషన్‌ డాక్టర్‌ శివరంజినీ సంతోష్‌ చెబుతున్నారు. కొన్ని కంపెనీలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లేకుండానే ఓఆర్‌ఎస్‌ జ్యూసులు అమ్ముతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు న్యూస్‌ మీటర్‌లో ఓ కథనం సైతం ప్రచురితమైంది. అంతేకాదు ఆమె తెలంగాణ హైకోర్టులో 2022 సెప్టెబర్‌లో ఓ పిల్‌ను సైతం దాఖలు చేశారు.

ఆమె తన పిల్‌లో ఈ విషయాలను పొందుపరిచారు.. ‘‘ కొన్ని కంపెనీలు తప్పుడు, తప్పుదోవ పట్టించే విధంగా ఓఆర్‌ఎస్‌ ప్రత్యామ్నాయ వస్తువుల్ని అమ్ముతున్నాయి. సదరు కంపెనీలు ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చెప్పిన ప్రమాణాలను పాటించటం లేదు. తప్పుడు ఓఆర్‌ఎస్‌ ప్రత్యామ్నాయ వస్తువుల కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. కొన్ని కంపెనీలు జ్యూసులను ఓఆర్‌ఎస్‌ అంటూ  పెద్ద ఎత్తులో ప్రకటనలు ఇస్తున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఓఆర్‌ఎస్‌లో గ్లూకోజ్‌, సోడియం క్లోరైడ్‌, పోటాషియం క్లోరైడ్‌, ట్రిసోడియం సిట్రైట్‌ తగిన మోతాదులో ఉండాలి. కొంచెం అటు, ఇటు అయినా కడుపులో సమస్యలు వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ రికమెండ్‌ చేసిన ఓఆర్‌ఎస్‌లను మాత్రమే కొనాలి. తప్పుడు ఫార్ములాలతో తయారైన వాటిని అస్సలు తీసుకోకూడదు. అలా చేయటం వల్ల చాలా మంది పిల్లలు ఆస్పత్రి పాలవుతున్నారు. పిల్లల కోసం ఓఆర్‌ఎస్‌ కొనే సమయంలో ప్యాక్‌ల మీద ఉన్న ఫార్ములాలను తల్లిదండ్రులు కచ్చితంగా చదవాలి’’ అని పేర్కొన్నారు.

ఇక, సుధీర్ఘ పోరాటం తర్వాత డాక్టర్‌ శివరంజినీ సంతోష్‌ విజయం సాధించారు. గురువారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఈ పిల్‌పై విచారణ జరిపారు. జ్యూసులను ఓఆర్‌ఎస్‌ అంటూ అమ్ముతున్న కంపెనీలకు సంబంధించిన ఈ పిల్‌పై స్పందించాలని ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో పాటు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 14 లోపల సదరు కంపెనీలు దీనిపై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని.. లేదంటే కోర్టే ఈ సమస్యపై తగిన ఉత్తర్వులు ఇస్తుందని  ఆంగ్ల వెబ్‌సైట్‌ న్యూస్‌మీటర్‌.ఇన్‌(https://newsmeter.in/) కథనం వెల్లడించింది.