బస్సులో కనిపించిన పాత సూట్‌కేస్.. కండక్టర్ తెరిచి చూసి అవాకయ్యాడు!

ఏపీలోని బాపట్ల డిపోలో ఎంఆర్ఎస్ రెడ్డి అనే వ్యక్తి డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇటీవల ఓ ప్రయాణికుడు సూట్ కేస్ బస్సులోనే మరిచి అలాగే వెళ్లిపోయాడు. దాన్ని గమనించిన డ్రైవర్.. పాత సూట్ కేస్ కావడంతో మొదటగా డస్ట్ బిన్ లో పడేద్దామని అనుకున్నాడు. కానీ, ఎంతకైన మంచిది అని ఆ సుట్ కేస్ ను డిపో తోటి ఉద్యోగుల ముందు ఓపెన్ చేయగా అందులో ఉన్న వస్తువులు చూసి అవాకయ్యాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా అద్దంకి మండలం కలవకూరు చెందిన కుంచాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తెలంగాణలోని కొత్తగూడెంలో నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా మేస్త్రీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే వెంకటేశ్వర్లు పని నిమిత్తం ఇటీవల తన సొంతూరుకు వెళ్లాడు. ఇక తిరిగి ప్రయాణంలో భాగంగా బాపట్ల డిపోకు చెందిన బస్సు ఎక్కాడు. తాను దిగాలనుకున్న స్టాప్ దిగి వెళ్లిపోయాడు. కానీ, వెంకటేశ్వర్లు తనతో పాటు తెచ్చుకున్న ఓ పాత సూట్ కేస్ ను మాత్రం ఆ బస్సులోనే మరిచిపోయాడు.

ఆ బస్సు బాపట్ల డిపోకు రాగానే ప్రయాణికులు అందరూ దిగి వెళ్లిపోయారు. బస్సులో సీట్ పై ఉన్న ఆ పాత సూట్ కేస్ ను గమనించిన ఆ బస్సు డ్రైవర్ ఎంఆర్ఎస్ రెడ్డి.. పడేద్దామని మొదటగా దాన్ని డిపో గ్యారేజ్ వద్దకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే కొందరి తన తోటి ఉద్యోగుల ముందు డ్రైవర్ ఎంఆర్ఎస్ రెడ్డి ఆ పాత సూట్ కేస్ ను ఓపెన్ చేయగా అందులో ఉన్న బంగారు అభరణాలను చూసి ఒక్కసారిగా అవాకయ్యాడు. వెంటనే ఆ సూట్ కేస్ ను డిపో అధికారుల వద్దకు తీసుకెళ్లి జరిగింది మొత్తం వివరించాడు. ఇక అందులో ఉన్న రసీదు ఆధారంగా వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.

అతను అప్పటికే కొత్తగూడెం చేరుకోవడంతో తనకు తెలిసిన వ్యక్తులను డిపోకు పంపించాడు. దీంతో అధికారులు ఆ విలువైన సూట్ కేసును వారికి అప్పగించారు. మరో విషయం ఏంటంటే? ఆ సూట్ కేస్ లో దాదాపు 5 లక్షల విలువైన బంగారు అభరణాలు ఉండడం విశేషం. డ్రైవర్ ఎంఆర్ఎస్ రెడ్డి నిజాయితో వ్యవహరించి ఆ సూట్ కేస్ ను అప్పగించినందుకు డిపో అధికారులు అతడిని అభినందించారు.

Show comments