nagidream
ఢిల్లీ లిక్కర్ స్కాం అంటే ఏంటి? ఈ స్కాం ఎప్పుడు మొదలైంది? ఈ స్కాంకి, ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఏమిటి?
ఢిల్లీ లిక్కర్ స్కాం అంటే ఏంటి? ఈ స్కాం ఎప్పుడు మొదలైంది? ఈ స్కాంకి, ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఏమిటి?
nagidream
ఢిల్లీ లిక్కర్ స్కాం దేశమంతా చర్చనీయాంశంగా మారింది. దీన్ని లిక్కర్ గేట్ అని కూడా అంటారు. ఇది ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన స్కాం. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. పార్టీ శ్రేణుల్లో అలజడి రేగింది. 2021లో ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టింది. ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తూ ఉన్న మద్యం పాలసీని తీసేసి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. ఆ సమయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో పలువురు రాజకీయ నేతలు సైతం అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశమైంది. ఢిల్లీలో తీగ లాగితే తెలుగు రాష్ట్రాల్లో డొంక కదిలింది. ఏపీలో పలువురికి ఈ స్కాంలో భాగస్వామ్యం ఉందని ఈడీ ఆరోపణలు చేసింది. కొంతమందిని అరెస్ట్ చేసింది. తాజాగా కవితను కూడా అరెస్ట్ చేసింది. కవిత ఇంట్లో నాలుగు గంటలకు పైగా సోదాలు నిర్వహించిన ఈడీ ఫైనల్ గా ఆమెను అరెస్ట్ చేశారు. అసలు ఈ స్కాం ఎలా ఎప్పుడు మొదలైంది. ఈ స్కాంలో కవిత భాగస్వామ్యం ఎంత వివరాలు మీ కోసం.
ఢిల్లీలో గతంలో 60 శాతం మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో.. 40 శాతం ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచేవి. అయితే వీటిని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని 2020లో కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం మేరకు 2021లో జనవరి 5న కొత్త లిక్కర్ పాలసీ కోసం మంత్రుల బృందంతో కూడిన ఒక కమిటీ వేసింది. ఈ బృందంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్ ఉన్నారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించిన రెండు నెలల తర్వాత అప్పటి మంత్రుల కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. 2021 మార్చి నెలలో మంత్రుల కమిటీ సిఫార్సుకి ఢిల్లీ క్యాబినెట్ అంగీకారం తెలిపింది. ఢిల్లీలో మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని అప్పటి ఢిల్లీ ప్రభుత్వం వేసిన కమిటీ సిఫార్సు చేసింది. ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఆదాయం రూ. 9500 కోట్లు పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
కమిటీ సిఫార్సు చేయడంతో ఢిల్లీ క్యాబినెట్ కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి సవరణలు చేయకుండా 2021 మే 21న కొత్త లిక్కర్ పాలసీని ఆమోదించింది. అయితే 2021 నవంబర్ నెలలో ఈ కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలపడంతో అదే ఏడాది ఈ పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం టెండర్లు వేసి ప్రైవేటు వ్యక్తులను మద్యం దుకాణాలను అప్పగించింది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం లైసెన్స్ ఫీజు భారీగా వసూలు చేసింది. కొత్త లిక్కర్ పాలసీ రాకముందు కాంట్రాక్టర్లు లైసెన్స్ కోసం 25 లక్షల రూపాయలు చెల్లించేవారు. అయితే ఈ కొత్త లిక్కర్ పాలసీ వచ్చాక ఎల్-1 లైసెన్స్ కోసం 5 కోట్లు చెల్లించారన్న వాదనలు ఉన్నాయి. అలానే ఇతర కేటగిరీల్లో కూడా లైసెన్స్ ఫీజులను భారీగా పెంచడంతో కేవలం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే లైసెన్సులు దక్కాయి. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టమొచ్చిన రేట్లకు మద్యం అమ్మేవారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం వల్ల ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతుందని ఆప్ సర్కార్ తెలిపింది.
అయితే 2022లో ఏప్రిల్ నెలలో నరేష్ కుమార్ అనే ఆయన ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆయన రావడం రావడమే కొత్త లిక్కర్ పాలసీ మీద ఫోకస్ చేశారు. అసలు ఏంటీ పాలసీ అని పూర్తిగా స్టడీ చేసిన అనంతరం.. ఇందులో అవకతవకలు జరిగాయని గుర్తించారు. లిక్కర్ పాలసీ విధానంలోనే కాకుండా.. మద్యం దుకాణాల కేటాయింపులో కూడా తప్పులు జరిగాయని నరేష్ కుమార్ గుర్తించారు. దీని మీద ఒక నివేదిక రెడీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ కు అందించారు. ఈయన కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఒక లేఖ రాశారు. 2022 జూలై 22న కేంద్ర హోమ్ శాఖ సీబీఐ దర్యాప్తుకి ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాము అనుకున్నంతగా ప్రభుత్వానికి ఆదాయం పెరగడం లేదని తెలిపింది. అయితే ప్రైవేటు వ్యక్తుల దగ్గర లంచాలు తీసుకుని మద్యం దుకాణాల లైసెన్సులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయల నష్టం చేకూర్చారని.. ప్రతీ బీర్ కేసుకి ప్రభుత్వానికి రావలసిన దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం మాఫీ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి.
మద్యం వ్యాపారులు, లైసెన్స్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిన 145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఢిల్లీ ప్రభుత్వం మాఫీ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. కేవలం కొందరు ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూరేలా ఈ కొత్త లిక్కర్ పాలసీని ఆప్ సర్కార్ తీసుకొచ్చిందని.. సౌత్ గ్రూప్ పేరుతో దక్షిణాదికి చెందిన కొందరు సిండికేట్ గా ఏర్పడి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా లబ్ధి పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ఆ వ్యక్తులు ప్రభుత్వానికి లంచాలు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఈ కొత్త పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని.. అవకతవకలు జరిగాయని 15 మంది వ్యక్తులపై ఆగస్టు 2022లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత పీఎంఎల్ఏ కింద మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు స్టార్ట్ చేసింది. కొత్త మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ, ఈడీలు రెండూ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి. పాలసీ విధాన రూపకల్పనలో అవకతవకలు జరిగాయని సీబీఐ, పాలసీ విధాన రూపకల్పన, అమలులో మనీలాండరింగ్ జరిగిందని ఈడీ దర్యాప్తులు చేస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ లిక్కర్ బిజినెస్ మేన్, రాబిన్ డిస్టిలరీస్ పేరుతో వ్యాపారం చేసిన అరుణ్ రామచంద్ర పిళ్లై, అరబిందో ఫార్మా వ్యవస్థాపకుడు శరత్ చంద్రారెడ్డి వంటి వారితో కూడిన సౌత్ గ్రూప్ ఒకటి ఈ లిక్కర్ స్కాంలో అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కీలకపాత్ర పిళ్ళైదని సీబీఐ వెల్లడించింది. ఈ స్కామ్ లో కవిత పాత్ర ఉందని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సా ఆరోపించారు. కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పనలో కవిత ప్రమేయం ఉందని.. కొత్త పాలసీకి సంబంధించిన చర్చల్లో ఆమె స్వయంగా పాల్గొన్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల సూచన మేరకే ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ విధానాన్ని రూపొందించారని అన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎక్సైజ్ అధికారులు, కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య హోటల్ లో డీల్ కుదిరిందని బీజేపీ ఎంపీ, ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. లిక్కర్ మాఫియా కమిషన్ ను పది శాతం పెంచేందుకు 150 కోట్ల డీల్ చేసుకున్నారని.. ఢిల్లీలో వ్యాపారం చేయడం కోసం అరుణ్ రామచంద్ర పిళ్ళైని కవితనే తీసుకువచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. కవిత కోసం ఢిల్లీలో ఒబెరాయ్ హోటల్ లో పిళ్ళై ఆరు నెలలు ఒక గదిని బుక్ చేసి ఉంచారని వారు అన్నారు. ఈ 150 కోట్ల డీల్ లో మొదటి విడత మొత్తం కవిత ద్వారా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు అందాయని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను బేస్ చేసుకుని దర్యాప్తు చేసిన ఈడీ తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని అరెస్ట్ చేసింది.