Venkateswarlu
Venkateswarlu
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గ్రూపు-2 పరీక్షలపై కీలక ప్రకటన చేశారు. గ్రూపు-2 పరీక్షల్ని యథావిధిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ గ్రూపు-2పై ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రిక్రూట్‌మెంట్ దశలవారీగా చేయాలని ముందే చెప్పామన్నారు. అభ్యర్థులు ఎక్కువ పరీక్షలు రాసే విధంగా వెసులు బాటు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సూచనలు ఇచ్చామన్నారు. ప్రకటించిన పరీక్షను రద్దు చేయటం సరికాదన్నారు.
ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో.. దాన్ని మార్చటం వీలు కాదని స్పష్టం చేశారు. పరీక్షల తేదీలను మార్చటం వల్ల బాగా ప్రిపేర్ అయిన అభ్యర్థులకు ఇబ్బందులు వస్తాయన్నారు. విద్యార్థుల స్కాలర్‌షిప్పుల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతేకాదు! మైనారిటీ సంక్షేమం విషయంలో మంత్రులు ఇతర నేతలు కూర్చుని మాట్లాడుకోవాలన్నారు. మైనారిటీ సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో చర్చించాలన్నారు.
కాగా, అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై కూడా మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నగరంలోని రియల్ ఎస్టేట్ రంగం ప్రపంచంతో పోటీ పడి ఎదిగిందని అన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. జీవనోపాధి కూడా బాగా పెరిగిందన్నారు. త్వరలోనే ముంబైని అధిగమిస్తామని ఆశా భావం వ్యక్తం చేశారు. కఠోర శ్రమ, క్రమ శిక్షణ, రాత్రింబవళ్లు కష్టపడితే ఇదంతా జరిగిందని అన్నారు. గ్రూపు-2 పరీక్షలు యాథావిధిగా జరుగుతాయంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.