iDreamPost
android-app
ios-app

Chennur HM: నరసయ్య సార్ కు ఘనంగా వీడుకోలు.. ఊరు ఊరంతా కదిలి

  • Published Jan 13, 2024 | 7:52 PM Updated Updated Jan 14, 2024 | 12:39 PM

సమాజంలో ఎంతో మంది వారికీ తోచిన వృత్తిలో పని చేస్తూ ఉంటారు. కానీ, ఒక్క ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే.. సమాజంలో అరుదైన గౌరవం లభిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ ప్రధానోపాధ్యాయుని కథే దీనికి ఉదాహరణ.

సమాజంలో ఎంతో మంది వారికీ తోచిన వృత్తిలో పని చేస్తూ ఉంటారు. కానీ, ఒక్క ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే.. సమాజంలో అరుదైన గౌరవం లభిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ ప్రధానోపాధ్యాయుని కథే దీనికి ఉదాహరణ.

  • Published Jan 13, 2024 | 7:52 PMUpdated Jan 14, 2024 | 12:39 PM
Chennur HM: నరసయ్య సార్ కు ఘనంగా వీడుకోలు.. ఊరు ఊరంతా కదిలి

సమాజంలో ఎప్పుడూ ఉపాధ్యాయులకు ఉన్నత స్థానమే దక్కుతుంది. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు తన జీవిత ప్రయాణంలో.. కొన్ని వేల మంది భావి భారత పౌరులను తయారుచేస్తాడు. తల్లి, తండ్రి, గురువు, దైవం అనే స్థానాలకు సైతం.. పాఠశాలలోని అదే గురువు అర్ధం చెప్పడం వలన నేర్చుకున్నవే. విద్యార్థులకు విద్యను బోధిస్తూ.. తానే నిరంతర విద్యార్థి అయ్యే వ్యక్తి గురువు. అలా విద్యార్థుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంటున్నారు.. కొంతమంది టీచర్లు. తాజాగా ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.. ఆ పాఠశాల నుంచి బదిలీ అయ్యారు. ఈ క్రమంలో ఆ పాఠశాల విద్యార్థులు ఈ ఉపాధ్యాయుడిని.. గ్రామమంతా కారులో ఊరేగించి మరీ ఘనంగా వీడ్కోలు పలికారు.

చూపరులను చూడముచ్చటగా అనిపించిన ఈ సంఘటన.. పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఒక ఉపాధ్యాయుడు బాధ్యతగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే.. యావత్ సమాజం అతనికి పట్టం కడుతుందని నిరూపించడానికి.. ఈ గ్రామంలో ఈ ప్రధానోపాధ్యాయుడికి జరిగిన ఘన సత్కారమే ఉదాహరణ. జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. 8 ఏళ్లుగా ప్రధానోపాధ్యాయుడిగా సేవలు అందించిన వ్యక్తి పోతుగంటి నరసయ్య. ఈ ఘన సన్మానం అందుకున్న ఉపాధ్యాయుడు ఇతనే. ఎక్కడో మారుమూలన ఉన్న గ్రామంలోని పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ పండితుడు. అక్కడి విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో రాణించేలా తయారు చేశారు. ఈ ప్రధానోపాధ్యాయుడు మరొక స్కూల్ కు బదిలీ అవుతున్నారని.. గ్రామస్థులు కారులో గ్రామమంతా ఊరేగిస్తూ, దారి పొడవునా పూలు చల్లుతూ ఘనంగా సన్మానించారు. ఆ గ్రామంలోని పాఠశాలకు ఇతని వంతుగా చేసిన శ్రమకు ప్రతిఫలమే ఈ ఘన సత్కారం. ఏ ఉపాధ్యాయుడికైనా ఇంతకుమించిన ఆనందం ఏం ఉంటుంది.

పోతుగంటి నరసయ్య ఇప్పుడు వావిలాల ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. ఈ సందర్బంగా చెన్నూరు పాఠశాల విద్యార్థులు.. తమ గురువుకు ప్రేమ, అభిమానాలతో ఇచ్చిన ఘన వీడ్కోలు కార్యక్రమం ఇది. కేవలం ఆ పాఠశాల విద్యార్థులే కాకుండా.. వారితో పాటు ఆ గ్రామస్థులు, యువకులు, ఉపాధ్యాయ బృందం అందరూ కలిసి గజమాలతో ఘనంగా సత్కరించారు. చెన్నూరు ఉన్నత పాఠశాలను నరసయ్య .. రాష్ట్ర స్థాయిలో ‘ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్కూల్’గా నిలిపారు. అంతేకాకుండా, పాఠశాల విద్యార్థితో దేశాలు – రాజధానులను అతి తక్కువ సమయంలో.. అనర్గళంగా చెప్పేలా శిక్షణ ఇచ్చి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్’లో పేరు నమోదు అయ్యేలా చేశారు. ఇలా అడుగడుగునా తన కర్తవ్యాన్ని నిర్వహించిన నరసయ్యకు దక్కిన గౌరవమే.. ఈరోజు కొన్ని వేల మంది ఇతని గురించి తెలుసుకునేలా చేసింది. ఈ ప్రధానోపాధ్యాయుడు ఎంతో మంది టీచర్లకు ఆదర్శంగా నిలుస్తారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

విద్యార్థులు, గ్రామస్థులు తనపైన చూపిస్తున్న ఎనలేని ప్రేమ, అభిమానాలకు.. నరసయ్య భావోద్వేగానికి గురయ్యారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉందని నర్సయ్య అన్నారు. తన విద్యార్థులు ఎంతో మంది ఉన్నత శిఖరాలను అధిగమించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఉద్యోగంలో చేరిన తొలి రోజుల్లో చెన్నూరు పాఠశాలలో పనిచేసి.. తిరిగి ఇదే పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా రావడం గొప్ప అనుభూతిగా ఉందని.. నరసయ్య చెప్పారు. మహాత్మా హెల్పింగ్ హ్యాండ్ అధ్యక్షుడు గంట రవీందర్ ,గ్రామస్థులు, యువకులు, ఉపాధ్యాయ బృందం సహకారంతోనే తానూ.. ఇన్ని కార్యక్రమాలు చేయగలిగానని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా పాఠశాలలో ఆ అభివృద్ధి అదేవిధంగా కొనసాగేలా.. గ్రామస్థులు, యువకులు సహకరించాలని ఆయన కోరారు. ఏదేమైనా.. ఓ గొప్ప ఉపాధ్యాయునికి దక్కిన అరుదైన గౌరవం ఇది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.