P Krishna
SI with a Great Heart: ఉన్నత చదువులు చదవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎంతోమంది అమ్మాయిలు చదువు మధ్యలోనే ఆపేస్తుంటారు.
SI with a Great Heart: ఉన్నత చదువులు చదవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎంతోమంది అమ్మాయిలు చదువు మధ్యలోనే ఆపేస్తుంటారు.
P Krishna
నేటి సమాజంలో ఉన్నతమైన చదువులు చదివిన వారు ఉన్నత ఉద్యోగాలు సంపాదిస్తూ గొప్ప జీవితాన్ని గడుపుతున్నారు. అందుకోసం తల్లిదండ్రులు తమ తలకు మించిన భారమైనప్పటికీ పిల్లలను ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారు. కొంతమంది విద్యార్థులకు ఉన్నత చదువు చదవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితుల సరిగా లేకపోవడంతో మధ్యలోనే ఆపేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిల చదువు విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా తలెత్తుతున్నాయి. పేదరికంతో ఇబ్బంది పడుతున్న ఇద్దరు విద్యార్థునుల చదువు బాధ్యత తీసుకొని ఓ ఎస్సై గొప్ప మనసు చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
చర్లలోని కస్పూర్బా పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు చర్ల ఎస్సై టివిఆర్ సూరి. ఈ సందర్బంగా పదవ తరగతి విద్యార్థులతో సమావేశం అయ్యారు. టెన్త్ పూర్తయ్యాక విద్యార్థులు ఏం చేయాలన్న విషయం గురించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనిత, తల్లిని కోల్పోయిన శిరీష పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. వారికి ఉన్నత విద్యనభ్యసించాలన్న కోరిక బలంగా ఉందన్న విషయం అర్థం చేసుకున్న ఎస్సై సూరి. కానీ వారి ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటంతో వారికి చేయూతనివ్వాలని భావించారు. ఇద్దరిని దత్తత తీసుకొని వారి చదువు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా చర్ల ఎస్సై సూరి మాట్లాడుతూ.. ‘చదువు పట్ల ఎంతో ఆసక్తి ఉన్న ఆ ఇద్దరు విద్యార్థినుల బాధ్యత తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఏ ప్రాంతంలో ఉన్నా వారి చదువులు పూర్తయ్యే వరకు నా సహాయసహకారాలు అందిస్తూనే ఉంటా. ఈ కాలంలో ఆడవాళ్లు మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. సమాజంలో ఆడపిల్లలు బాగా చదివి రాణించాలి. అప్పుడే కుటుంబం, సమాజం బాగుంటుంది. ఈ ఇద్దరు విద్యార్థినులు ఉన్నత విద్యనభ్యసించి సమాజంలో గొప్ప పొజీషన్ లోకి రావాలని ఆకాంక్షిస్తున్నాను. ఇప్పటికే పీనపాక మండలంలో ముగ్గురు విద్యార్థునులను దత్తత తీసుకొని చదివిస్తున్నా.. ఇప్పుడు మరో ఇద్దరి బాధ్యతలు స్వీకరించాను.’ అని అన్నారు. విద్యార్థుల పట్ల గొప్ప మనసు చాటుకున్న ఎస్సైని అందరూ అభినందిస్తున్నారు.