నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒ‍క్కసారిగా బస్సు టైరు పేలటంతో..

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కవయిపోయాయి. అతివేగం, నిర్లక్ష్యం ఇలా ఏదో ఒక కారణంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పెద్ద వాహనాలు ఢీకొట్టడం కారణంగా చిన్న వాహనాల వారు చనిపోయే సంఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా, నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌ బస్సు బైకును ఢీకొట్టగా.. బైకుపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై వెళుతున్న సమయంలో బస్సు టైరు పేలటంతో ఈ ప్రమాదం జరిగింది.

బస్సు.. బైకును ఢీకొట్టిన తర్వాత పొలంలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు బస్సులోని వారికి ఏమీ కాలేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సోమవారం ఓ ప్రైవేట్‌ బస్సు మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌ వెళుతూ ఉంది. నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండలం అన్నపురెడ్డి గూడెం స్టేజీ వద్ద బస్సు టైరు ఒక్కసారిగా పేలింది. దీంతో బస్సు అదుపు తప్పింది. ఈ నేపథ్యంలోనే రోడ్డుపై వెళ్తున్న ఓ బైకును ఢీకొట్టింది. బస్సు ఢీకొట్టిన వేగానికి బైకుపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

వాహనదారులు అతడ్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. బైకు ఢీకొట్టిన తర్వాత బస్సు పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులోని వారికి ఏమీ కాలేదు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని వాహనదారులు పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్ని ఛత్తీష్‌ఘర్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments